టీడీపీలో ఇప్పుడు ఆ లేడీ లీడ‌రే సెన్షేష‌న‌ల్‌... పార్టీ ప‌గ్గాలు ఆమెకిస్తే తిరుగులేన‌ట్టే...!

VUYYURU SUBHASH

ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రం జిల్లా టీడీపీ రాజ‌కీయాల‌పైతాజాగా అందిన నివేదిక.. టీడీపీలో చ‌ర్చ‌కు దారితీసింది. జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితిపై చంద్ర‌బాబు తాజాగా నివేదిక‌లు తెప్పించుకున్నారు. గ‌డిచిన ఏడాదిన్న‌ర కాలంలో పార్టీ ప‌రిస్థితి ఏంటి?  నాయ‌కులు ఏం చేశారు?  ఇప్పుడు ఏం చేస్తే.. పార్టీ ప‌రిస్థితి పుంజుకుంటుంది? ఇప్ప‌టి వ‌ర‌కు నాయ‌కుల దూకుడు ఎలా ఉంది? అధికార పార్టీ నేత‌లకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఏమేర‌కు చెక్ పెడుతున్నారు? అనే అంశాలు కీల‌కంగా మారాయి.

 

ఈ క్ర‌మంలోనే తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాపై అందిన నివేదిక‌లో కీల‌క‌మైన రెండు నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌స్థావ‌న జ‌రిగింది. వీటిలో చీపురుప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితిపై ఎక్కువ‌గా వివ‌ర‌ణ ఉంద‌ని తెలిసింది. చీపురుప‌ల్లిలో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని.. అయితే, అదేస‌మ‌యంలో కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న అదితి గ‌జ‌ప‌తిరాజు మాత్రం దూకుడుగా ఉన్నార‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. ఆమె కేంద్ర మాజీ మంత్రి, అశోక్ గ‌జ‌ప‌తిరాజు కుమార్తె. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు.

 

నిజానికి ఇక్క‌డ ఓట‌మి ఎరుగ‌ని విధంగా టీడీపీ దూసుకుపోయింది. గ‌తంలో అశోక్ గ‌జ‌ప‌తి రాజే వ‌రుస‌గా విజ‌యాలు సాధించి.. పార్టీని బ‌లోపేతం చేశారు. అయితే, మ‌ధ్య‌లో కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఇండిపెండెంట్‌గా గెల‌వ‌‌డంతో టీడీపీకి చెక్ ప‌డింది. ఆ త‌ర్వాత‌.. 2009, 2014 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, గ‌త ఏడాది మ‌ళ్లీ వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున కోల‌గ‌ట్ల విజ‌యం సాధించారు. అయితే, ఇక్క‌డ నుంచి ఓడిపోయిన‌ప్ప‌టికీ.. అదితి మాత్రం నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. సొంత‌గా ఓ నిధిని ఏర్పాటు చేసి.. ఇటీవ‌ల లాక్‌డౌన్ స‌మ‌యంలో పేద‌ల‌కు నిత్యావ‌స‌రాల‌ను పార్టీ పేరుతో పంచారు.

 

అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షంగా ఏదైనా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల్సి వ‌చ్చినా కూడా ఆమె రోడ్ల మీదికి వ‌స్తున్నారు. అదేవిధంగా పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నేత‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకుంటున్నారు. ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల ప‌నితీరును కూడా ఎండ‌గ‌డుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఫీల్ గుడ్ అనే మాట వినిపిస్తున్న‌దంటూ.. నివేదిక స్ప‌ష్టం చేయ‌డంతో చంద్ర‌బాబు ఒకింత ఊపిరి పీల్చుకున్నార‌ట‌. అదే స‌మ‌యంలో ఆమెకు నియోజ‌క‌వ‌ర్గంతో పాటు జిల్లాలో మ‌రిన్ని బాధ్య‌త‌లు ఇచ్చినా స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: