సీఎం జగన్ మాట : విజయసాయిరెడ్డి వచ్చాకే “గంట” మోగుతుంది..!

Sunil Medarametla

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంట్రీకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రేకులు వేశారా..? గంటాను వైఎస్సార్సీపీలోకి తీసుకుంటే వచ్చే సమస్యలు ఏంటి..? అసలు గంటా విషయంలో సీఎం జగన్ రచించబోతున్న కొత్త వ్యూహం ఏంటీ..? గంటా వైఎస్సార్సీపీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాల్సిందేనా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఆంధ్రప్రదేశ్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు ఈ కథ ఏంటో ఒక్కసారి చూద్దాం..

టీడీపీ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలోకి చేరబోతునట్టు.. ఇప్పటికే దానికోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు సమాచారం. పైగా గంటా చేరికకు సీఎం జగన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా నిన్నటి మాట. ప్రస్తుతం గంటా ఎంట్రీకి సీఎం జగన్ బ్రేకులు వేసినట్టు తెలుస్తుంది. అందుకు ముఖ్యకారణం ఎంపీ విజయసాయి రెడ్డి.

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జ్ గా విజయసాయి రెడ్డిని, సీఎం జగన్ నియమించిన సంగతి తెలిసిందే. మరి అలాంటి ఉత్తరాంధ్రకు చెందిన గంటా లాంటి కీలక నేత వైఎస్సార్సీపీలోకి చేరాలంటే కచ్చితంగా విజయసాయి సహకారం ఉండాల్సిందే. ఒకవేళ విజయసాయిని కాదని, గంటాను గనుక పార్టీలోకి తీసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్సీపీ చీలడం ఖాయం. కాగా, ఇప్పటికే జగన్, విజయసాయిని దూరం పెడుతున్నారని, త్వరలోనే విజయసాయి, జగన్ కి షాక్ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిస్తితులలో గంటాను నేరుగా పార్టీలోకి తీసుకుంటే ఈ వార్తలకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది.

ఇవన్నీ ఆలోచించిన సీఎం జగన్.. ప్రస్తుతం కరోనా బారిన పడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి కోలుకుని వచ్చిన తర్వాతనే గంటాను పార్టీలోకి తీసుకోవాలని.. అది కూడా విజయసాయి ద్వారానే గంటా పార్టీలోకి రావాలని సీఎం జగన్ భావిస్తున్నారట. ప్రస్తుతం గంటా ఎవరితో అయితే సంప్రదింపులు జరుపుతున్నారో వాళ్ళని కూడా సైలెంట్ అయిపోమని సీఎం జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. మరి గంటా ఎంట్రీకి విజయసాయి ఎలాంటి ముగింపు ఇస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: