`మిష‌న్‌.. స‌బ్బం హ‌రి` చంద్ర‌బాబు తెర‌వెనుక వ్యూహం!!

R Bhanu


రాజ‌కీయాల్లో  పార్టీల‌కు, నేత‌ల‌కు టార్గెట్లు చాలానే ఉంటాయి. పార్టీల‌కు అధికారంలోకి రావాల‌ని, నేత‌లకు ప‌ద‌వులు పొందాల‌ని, అంతో ఇంతో వెనుకేసుకోవాల‌ని.. ఇలా అనేక టార్గెట్లు పెట్టుకుని ముందుకు సాగ‌డ‌మే రాజ‌కీయం! అయితే, దీనికి భిన్నంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆలోచిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నిజానికి నేత‌లు పార్టీల‌ను ప‌ట్టుకుని ఎదుగుతారు. పార్టీల అండ‌తో ముందుకు సాగుతారు. పార్టీని అడ్డుపెట్టుకుని హ‌ల్‌చ‌ల్ చేస్తారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింద‌ని అంటున్నారు  ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ సీనియ‌ర్లు. 

 


ఈ పార్టీలో సీనియ‌ర్లు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ దీన‌స్థితిలోకి జారిపోయింది. ఎమ్మెల్యేల‌ను, నేత‌ల‌ను కూడా పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు కాపాడుకోలేక పోతున్నార‌ని అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో సీనియ‌ర్లు పెద‌వి విరుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విభ‌జించి చంద్ర‌బాబు చేస్తున్న రాజ‌కీయంపైనా వారు చ‌ర్చించుకుంటున్నారు. కోస్తా ప్రాంతంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు పూర్తిగా స్వేచ్ఛ‌ను ఇస్తే.. పార్టీ డెవ‌ల‌ప్ అవుతుంద‌ని, పోనీ.. దెబ్బ‌తిన‌కుండా అయినా ఉంటుంద‌ని చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకున్నార‌ట‌. 


ఇక‌, సీమ‌లో మాత్రం రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని న‌మ్ముకున్నా.. చంద్ర‌బాబుకు క‌లిసి వ‌చ్చిన ప‌రిస్థితి క‌నిపించ‌లేద‌ని, అందుకే ఆయ‌న సీమ రాజ‌కీయాల‌పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. అదేవిధంగా, ఉత్త‌రాంధ్ర విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డి విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ ఒక‌ప్పుడు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి దిగ‌జారింద‌ని చంద్ర‌బాబుకు స‌మాచారం అందింద‌ట‌. నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించే వారు లేక‌పోవ‌డం, పైగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేసులు పెడుతుందేమోన‌ని జంకుతూ ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్న వారు ఎక్కువ‌గా ఉన్నార‌ని చంద్ర‌బాబుకు తెలిసింది. 


అచ్చెన్నాయుడు వంటి కీల‌క నాయ‌కుడు,.. ఎంపీగా రామ్మోహ‌న్‌నాయుడు ఉన్నా.. ఎమ్మెల్యేలుగా గంటా శ్రీనివాస‌రావు స‌హా వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు ఉన్న‌ప్ప‌టికీ ఎవ‌రూ కూడా పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించ‌క‌పోగా.. జ‌గ‌న్ స‌ర్కారుపై `ఢీ అంటే ఢీ` అనే రేంజ్‌లో పోరాడేవారు క‌రువ‌య్యార‌ని బాబు గుర్తించారు. ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎంపీ.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీచేసి ఓడిపోయిన స‌బ్బ హ‌రిని చంద్ర‌బాబు టార్గెట్‌గా పెట్టుకుని.. ఆయ‌న చేతుల మీదుగా ఉత్త‌రాంధ్ర‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని అంటున్నారు. 


ఇటీవ‌లకాలంలో స‌బ్బం హ‌రితో చంద్ర‌బాబు అనుకూల మీడియాలో వారానికోసారి డిబేట్లు పెడుతున్నారు. సీఎం జ‌గ‌న్‌పైనా, ఆయ‌న పాల‌న‌పైనా విమ‌ర్శ‌లు చేసేలా తెర‌చాటున రూపుదిద్దుకున్న స్కెచ్‌ను అమ‌లు చేస్తున్నార‌ని పార్టీ సీనియ‌ర్లు చెప్పుకొంటున్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డం, వివాదాల జోలికి పోక‌పోవ‌డం వంటి మంచి ల‌క్ష‌ణాలు ఉన్న స‌బ్బం హ‌రితో జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయిస్తే.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా నాటుకుంటుంద‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌ట‌! ఈ నేప‌థ్యంలోనే `మిష‌న్‌ స‌బ్బం హ‌రి` కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నార‌ట‌. మ‌రి ఈ మిష‌న్.. ఉత్త‌రాంధ్ర‌లో ఏ మేర‌కు టీడీపీని బ‌లోపేతం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: