హెరాల్డ్ ఎడిటోరియల్ : కేంద్రం అఫిడవిట్ తో చంద్రబాబు, సుజనాకు ఒకేసారి షాక్.. ఇప్పటికైనా నోళ్ళు మూతపడతాయా ?
హైకోర్టులో కేంద్రం దాఖలు చేసిన తాజా అఫిడవిట్ వల్ల ఒకేసారి ఇద్దరి పరువు పోయినట్లైంది. నిజానికి రాజధాని అమరావతిగా చంద్రబాబు డిసైడ్ చేసినపుడు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదు. అప్పట్లో అంతా తనిష్టం వచ్చినట్లు వ్యవహరించిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే మాట మార్చేశాడు. ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చాడో అప్పటి నుండి కేంద్రం అనుమతి లేనిదే రాజధానిని మార్చేందుకు లేదంటే చంద్రబాబు, సుజనాలు కావాలనే అబద్ధాలు ప్రచారం చేశారు. ఒక విధంగా రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న వాళ్ళని చంద్రబాబు, సుజనాలే తప్పుదోవ పట్టించారు. మూడు రాజధానుల విషయంలో జగన్ను ఆపటం తమ వల్ల కాదని అర్ధమైపోగానే కేంద్రాన్ని కూడా ఈ వివాదంలోకి లాగాలని వీళ్ళు ప్రయత్నించారు. కేంద్రం తాజా అఫిడవిట్ వల్ల వీళ్ళద్దరు ఫెయిల్ అయినట్లు అర్ధమైపోయింది.
బహుశా ఈ విషయం చంద్రబాబుకు బుధవారం మీడియా సమావేశం నాటికే తెలుసేమో. అందుకనే తానింట్లోనే ఉంటానని, జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా జనాలే ఉద్యమాలు చేయాలని, కీలక పాత్ర పోషించాలని, తాను మాత్రం ఇంట్లోనే ఉంటానని చెప్పి పోరాటంలో చేతులెత్తేశాడు. చంద్రబాబు వైఖరి ఎలాగుందంటే తాను అధికారంలో ఉన్నపుడు అంతా తనిష్టం. తానేం చేసినా ఎవరు మాట్లాడకూడదు, అభ్యంతరాలు చెప్పకూడదన్నట్లుగా వ్యవహరిస్తాడు. అదే ఖర్మకాలి ప్రతిపక్షంలోకి వస్తే ప్రభుత్వం ప్రతిపక్షాలను లెక్క చేయటం లేదని, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం తప్పేనంటూ యాగీ చేస్తుంటాడు. జగన్ ప్రభుత్వం విషయంలో చంద్రబాబు ఇపుడు చేస్తున్నదిదే. తన హయాంలో రాజధాని విషయంలో జోక్యం చేసుకోని కేంద్రం ఇపుడు మాత్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందనే కనీసం ఇంగితాన్ని కూడా చంద్రబాబు కోల్పోయాడు.
హోలు మొత్తం చూసిన తర్వాత అర్ధమవుతున్నదేమంటే చంద్రబాబు, సుజనా లాంటి వాళ్ళను నమ్ముకుంటే ఆందోళన చేస్తున్న వాళ్ళల్లో నిజమైన రైతులు నష్టపోవటం ఖాయం. రాజధాని అమరావతి నుండి వైజాగ్ కు తరలిపోవటం ఖాయం. ఈరోజు కాకపోతే ఇంకోరోజంతే. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని అమరావతి ప్రాంతం రైతులు ఆందోళన చేయటంలో తప్పులేదు. అదే సమయంలో ఇతర ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునే హక్కు కూడా రాజధాని ప్రాంత వాసులకు లేదని గ్రహించాలి. అమరావతి నష్టపోతోందంటే దానికి కారణం చంద్రబాబే కానీ జగన్ కాదన్న చేదునిజాన్ని కూడా ఈ ప్రాంతవాసులు అంగీకరించాలి. రాజధాని పేరుతో వేలాది ఎకరాలను సమీకరించిన చంద్రబాబు రైతులకు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వలేదు. అలాగే వాళ్ళకు కేటాయించిన కమర్షియల్ ప్లాట్లు, ఇళ్ళ స్ధలాలను కూడా చాలామందికి రిజిస్టర్ చేయలేదని అంటున్నారు.