బాబోయ్.. చైనాతో యుద్ధం విషయంలో ఇండియన్స్ అంత కసిగా ఉన్నారా..?
అయితే గల్వాన్ ఘటనతో సీన్ మారిపోయింది. ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్న భారత్.. ఇక చైనాతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడింది. పొరుగుదేశంతో కఠిన వైఖరి అవలంభిస్తోంది. చైనా యాప్ లు నిషేధించింది. చైనా కంపెనీలకు కాంట్రాక్టులు రద్దు చేసింది. చైనా భాషను నిషేధించింది.. ఇలా ఏ మాత్రం అవకాశం వచ్చినా చైనాకు చుక్కలు చూపిస్తోంది.
ఈ నేపథ్యంలో భారతీయ జనం కూడా చైనాపై కసితో రగిలిపోతున్నారని..తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేలింది. జనం ఏమంటున్నారంటే.. చైనాను నమ్మొద్దు, అది మోసం చేస్తోంది అని 84 శాతం జనం చెబుతున్నారు.. సరిహద్దు వివాదంపై చైనాతో యుద్ధం చేస్తే తప్పేమీ లేదని 59 శాతం ప్రజలు చెబుతున్నారట.. అంతేకాదు, మన సైన్యం సామర్థ్యం మీద నమ్మకం ఉంది, చైనాకు బుద్ధి చెబుతుంది అంటున్నారు 72 శాతం ప్రజలు..
దీన్ని బట్టి చూస్తే జనం చైనాపై ఎంత కసిగా ఉన్నారో అర్థమవుతోంది. ఇక మోడీ చైనా యాప్స్ నిషేధించడాన్ని ఏకంగా 91 శాతం జనం మెచ్చుకున్నారు. అంతే కాదు.. చైనాకు పగ్గాలు వేయడంలో మోడీ సరైన దిశలో వెళ్తున్నాడు అని జనం ఫీలవుతున్నారు. ఇక మిగిలిన విషయాల్లోకి వస్తే.. జమ్ముకాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 ఎత్తివేత మీద కూడా మెజారిటీ వోటర్లు సంతృప్తిని వ్యక్తం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిష్టర్ మైనారిటీల్లో అభద్రత భావాన్ని పెంచుతున్నాయనీ అది దేశానికి మంచిది కాదని చెప్పారు. ఆర్థికవ్యవస్థ సవాళ్లను ఎదుర్కోవడంలో మన్మోహన్‌సింగ్ కన్నా మోడీయే బెటర్ అని జనం ఫీలవుతున్నారు.