హెరాల్డ్ ఎడిటోరియల్ : టిడిపిని హిప్నాటిజం చేస్తున్న బిజిపి..చంద్రబాబు గిలగిల కొట్టుకుంటున్నాడా ?

Vijaya
కొత్తగా బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సోము వీర్రాజు దగ్గర నుండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులంతా  రెండు అంశాలపై చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అందులో మొదటిది 2024లో అధికారంలోకి వచ్చేది తామే అంటూ ఒకటే ఊదరగొడుతున్నారు.  ఇక రెండో అంశం ఏమిటంటే రాష్ట్రంలో ప్రతిపక్ష స్ధానం ఖాళీగా ఉందని.  ముందు తమ లక్ష్యం ఖాళీగా ఉన్న ప్రతిపక్ష పార్టీ స్ధానాన్ని భర్తీ చేయాలన్న విషయంపై దృష్టి పెట్టినట్లు పార్టీ సీనీయర్  నేతలు పదే పదే చెబుతున్నారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అన్న విషయాన్ని పక్కనపెట్టేద్దాం. వాస్తవ పరిస్ధితిని ఒకసారి చూద్దాం. ప్రస్తుతం విషయం ఏమిటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా టిడిపి అధినేత చంద్రబాబునాయుడుదే అనటంలో సందేహం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయినా 23 మంది ఎంఎల్ఏలను గెలుచుకుంది. కాబట్టి ప్రతిపక్షమైతే టిడిపి అనే ఒప్పుకోవాలి.




ఇక బిజెపి విషయానికి వస్తే మొన్నటి ఎన్నికల్లో కమలంపార్టీకి వచ్చిన ఓట్ల శాతం 0.84. నోటా ( నన్ ఆఫ్ ద ఎబోవ్) వచ్చిన ఓట్లకన్నా బిజెపికి చాలా తక్కువే. దీన్నిబట్టే బిజెపి రాష్ట్రంలో ఎంత బలంగా ఉందనే విషయం అందరికీ అర్ధమైపోతోంది. నేతలదేముంది క్యాడర్ లో హుషార్ కలిగించేందుకు వంద మాటలు చెబుతారు. క్షేత్రస్ధాయికి సంబంధం లేకుండా క్యాడర్ తో పాటు జనాలను కూడా మాయచేయటానికి అనేక మాటలు చెప్పటం అలవాటే. బిజెపి అగ్రనేతలు చెబుతున్న మాటలు కూడా ఇలాంటివే అనటంలో సందేహం లేదు.  బిజెపి నేతలు తల్లక్రిందులుగా తపస్సు చేసినా ప్రతిపక్షహోదా అయితే దక్కదు. ఎందుకంటే పార్టీకి  జనాల్లో ఆదరణ లేదు, క్యాడర్ కూడా లేదు. ఒకవేళ టిడిపి ఎంఎల్ఏలను తనలోకి లాక్కుంటే అప్పుడు అసెంబ్లీలో ఏమైనా మార్పులు జరగవచ్చేమో కానీ జనాధరణలో  మార్పులు వచ్చేస్తాయని మాత్రం అనుకునేందుకు లేదు.




బిజెపి అగ్రనేతలకు కూడా ఈ విషయాలు తెలిసినా పదే పదే రాష్ట్రంలో రాజకీయ శూన్యతను తామే భర్తీ చేస్తామంటూ ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు ? ఎందుకంటే టిడిపి నేతలను బిజెపి హిప్నాటిజం చేస్తోంది. చంద్రబాబును నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తుండదని ఒకటికి పదిసార్లు టిడిపి నేతల మైండ్ సెట్ మార్చే ప్రయత్నం చేస్తోంది. దానికి తగ్గట్లే తానేం మాట్లాడుతున్నాడో చంద్రబాబుకు కూడా అర్ధం కావటం లేదు. అదే సమయంలో తనతో పాటు టిడిపిపై   బిజెపి ఎంత చులకనగా మాట్లాడుతున్నా చంద్రబాబు ఎదురుతిరిగి ఒక్క మాట కూడా  మాట్లాడలేకపోతున్నాడు.  చంద్రబాబు ఎంతసేపు వైసిపిని టార్గెట్ చేస్తున్నాడే కానీ బిజెపిపై ఎదురుదాడి చేయాలంటేనే భయపడిపోతున్నాడు. దీన్నే కమలంపార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుంది.  అందుకనే చంద్రబాబు, టిడిపిని కాఫీలో పడిన ఈగను తీసేసినట్లుగా బిజెపి తీసేస్తోంది. దీని వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటంటే టిడిపి నేతలను తమ పార్టీలోకి లాగేసుకోవటమే.




చాపక్రింద నీరులాగ ఈ పని ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. టిడిపిలో నిస్తేజంగా ఉన్న లీడర్లను, చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేక పార్టీకి దూరంగా ఉంటున్న నేతలతో బిజెపి నేతలు టచ్ లోకి వెళుతున్నట్లు సమాచారం. ప్రధానంగా వైజాగ్ సిటిలో టిడిపి తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏలను తమ పార్టీలోకి లాక్కునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కమలం నేతలే చెబుతున్నారు. కాకపోతే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే పడే అనర్హత వేటును  తప్పించుకునే విషయాన్నే  ఆలోచిస్తున్నారట.  మొత్తం మీద చంద్రబాబు రాజకీయ జీవితం అయిపోయిందనే విషయాన్ని బిజెపి ప్రధానంగా ప్రచారం చేస్తోంది.  ఇంకా చంద్రబాబును నమ్ముకుంటే అందరు ముణిగిపోతారనే విషయాన్ని బిజెపి నేతలు పదే పదే టిడిపి నేతల బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మరి టిడిపి నేతలపై బిజెపి హిప్నాటిజం ఎంత వరకు పనిచేస్తుందో చూడాల్సిందే.




ఇక 2024లో అధికారంలోకి వచ్చే విషయం అంటారా కలలు కనే హక్కు అందరికీ ఉన్నట్లే బిజెపి నేతలకు కూడా ఉంది. అధికారంలోకి వచ్చేమాట దేవుడెరుగు కనీసం 175 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పోటిలోకి దింపితే అదే చాలా గొప్ప. మొన్నటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటి చేయటానికి గట్టి అభ్యర్ధులే దొరకలేదు. పోటి చేసిన వాళ్ళల్లో ఎంతమందికి డిపాజిట్లు వచ్చాయంటే పార్టీ నేతలే సరిగా చెప్పలేరు. ఇటువంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని చెబితే జనాలు నవ్వుకుండా ఉంటారా ?  2014లో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్, బిజెపిలు కలిసే జనాలను మోసం చేశాయి. రాష్ట్రాన్ని విభజించటమే తప్పంటే పైగా అడ్డుగోలుగా విభజించటం కాంగ్రెస్ చేసిన మోసం. అదే సమయంలో కాంగ్రెస్ కు సహకరించటమే కాకుండా ప్రత్యేకహోదా, వైజాగ్ కు ప్రత్యేక రైల్వేజోన్ లాంటివి ఇవ్వకుండా బిజెపి మరింత మోసం చేసింది. తన హామీలను నెరవేర్చకుండా బిజెపి ఎన్ని మాటలు చెప్పినా జనాలు నమ్మరు. కాబట్టి హామీలను నెరవేర్చేంత వరకూ బిజెపి నేతలు కలలు కనటం తప్ప చేయగలిగిందేమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: