నా వెంట్రుక కూడా పీకలేరు.. రేవంత్ రెడ్డి నిప్పులు..?
వీటి ఆధారంగా ఈ అవినీతి కేసులో రేవంత్ రెడ్డిని ఇరికిస్తారని భావించారు. అయితే.. తనపై ఎన్ని కుట్రలు చేసినా.. తన వెంట్రుక కూడా పీకలేరంటున్నారు రేవంత్ రెడ్డి. ఏసీబీకి చిక్కిన కేసులో అరెస్టైన రియల్టర్ అంజిరెడ్డితో తనకు లింకు పెట్టడంపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలుగుదేశం నాయకుడైన అంజిరెడ్డి తన గెలుపుకు కృషి చేశారని, అక్రమ కేసులు పెడతామని మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు బెదిరించినా బెదరకుండా తనకు మెజారిటీ రావటంలో కష్టపడ్డాడని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో తప్పుబట్టాల్సింది ఏముందని ఆయన ప్రశ్నించారు. అంతే కాదు.. ఎస్సీ కాలనీలో అభివృద్ధి కోసం ఫండ్ కేటాయిస్తూ ఇచ్చిన తన లెటర్ అంజిరెడ్డి వద్ద ఉండటంలో తప్పేముందని రేవంత్ ఎదురుదాడి ప్రారంభించారు.
అంజిరెడ్డి ఇంట్లోనే.. భూ వివరాలు కోరుతూ పలు సర్వే నెంబర్లలో ఆర్టీఐ పెట్టేందుకు రెడీ చేసిన లేఖలు కూడా దొరికాయి. దీనిపైనా రేవంత్ స్పందించారు. అవినీతిని వెలికితీసేందుకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఆర్టీఐ చట్టం ద్వారా మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాల కోసం తను పలు సర్వే నెంబర్లలో ఆర్టీఐ పెట్టేందుకు లేఖలు సిద్ధం చేయటం తప్పు ఎలా అవుతందని రేవంత్ ప్రశ్నించారు. అంతే కాదు.. అసలు తనది ఒక్కశాతం తప్పు ఉన్నా ఈ ప్రభుత్వం ఇప్పటికే నా మీద పడేదని, కొందరు లుచ్ఛాగాళ్లు చేసే ప్రచారాన్ని నమ్మవద్దని రేవంత్ ఘాటుగా బదులిచ్చారు.