ఎడిటోరియల్: నేలవిడిచి సాము చేయడం అంటే ఇదేగా ?

ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారం.మొన్నటి వరకు అధికారం చెలాయించిన ఏపీలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా తయారైంది. అసలు 2024 ఎన్నికల నాటికి టిడిపి బలమైన నాయకులు ఉంటారా అనేది సందేహంగా మారింది. ప్రస్తుతం నాయకులంతా అధికార పార్టీ దూకుడుతో బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ నాయకుడు అరెస్ట్ అవతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళనలు చేయాలంటూ పదేపదే చంద్రబాబు ఏపీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నా, ఏ ఒక్క నాయకుడు వాటిని పట్టించుకోనట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు.


ఈ పరిస్థితులను బట్టి అంచనా వేస్తే, టిడిపి 2024 సమయానికి పూర్తిగా బలహీనమైపోయి, ఉనికిని కోల్పోతుందనే అంచనాల్లో అంతా ఉన్నారు. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏడు పదుల వయస్సు దాటి పోవడంతో, ఇక ఎంతోకాలం యాక్టివ్ గా రాజకీయాల్లో ఉండే పరిస్థితి లేదు. ఆయన కుమారుడు లోకేష్ సైతం పార్టీని ముందుకు నడిపించగల సమర్థత లేదనేది ఆ పార్టీ నాయకుల అభిప్రాయం. ఇదంతా ఇలా ఉంటే. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాదులోనే నివాసంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విషయంపైన ఆయన దృష్టి సారించినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో, రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.


 ఏపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందనుకుంటున్న సమయంలో, తెలంగాణ పార్టీ మరింతగా బలోపేతం చేసే విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొద్దిరోజుల క్రితమే తెలంగాణ టిడిపి నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ యాక్టివ్ చేసి, పునర్వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి అనే విషయంపై చర్చించారు. ఈ మేరకు తెలంగాణలో టిడిపి రాష్ట్ర కార్యవర్గంని వెంటనే నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. వాస్తవంగా చూసుకుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడో బలహీనం అయిపోయింది.


అక్కడ కొద్దో గొప్పో నాయకులు ఉన్నాయాక్టివ్ గా లేరు. టిడిపి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి, పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా వ్యవహరించే స్థాయిలో ఉన్న నాయకులు ఎవరు లేరు. గ్రామస్థాయిలో కొద్దో గొప్పో కార్యకర్తలు ఉన్నా, వారంతా ఇతర పార్టీల వైపు ఆకర్షితులైనట్టుగానే కనిపిస్తున్నారు. దీనికితోడు తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర పార్టీ అన్న ప్రచారం కూడా టిఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం వంటి వ్యవహారాలతో, అక్కడ టిడిపి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మళ్ళి పార్టీకి పునర్ వైభవం తీసుకు వచ్చే, కొత్త కార్యవర్గాన్ని చంద్రబాబు నియమించాలని డిసైడ్ అయ్యారు.


ప్రస్తుతం తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఎల్.రమణ కొనసాగుతున్నారు. గతంలో రాష్ట్ర కమిటీలో 140 మంది సభ్యులు ఉండే వారు. కానీ ఇప్పుడు 70 మందితో  కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడించే విధంగా ప్రయత్నించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. అలాగే దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ టిడిపి అభ్యర్థిని రంగంలోకి దించి పార్టీని పరుగులు పెట్టించాలని చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, అందులోనూ సీమాంధ్ర ముద్ర వేయించుకోవడం వంటి పరిణామాలు టిడిపికి పెద్ద ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు.


ఇప్పటి కే టీడీపీకి చెందిన  పెద్దఎత్తున నాయకులు అధికార పార్టీ టిఆర్ఎస్ లో చేరిపోవడంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కోలుకోవడం అసాధ్యం. అయినా ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు ఇక్కడ పార్టీకి జీవం పోయాలనే విధంగా చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా ప్రయాస అనే అభిప్రాయం సొంత పార్టీ నాయకుల్లోనే వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: