ఆంధ్రప్రదేశ్‌లో పరువు కేవలం కొందరికే సొంతమా..?
ఇప్పుడు ఇదే సందేహం వ్యక్తమవుతోంది. అమరావతి భూముల కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ మొత్తం సందేహాలకు కారణభూతమవుతోంది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తన పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నందున ఆ ఎఫ్ ఐఆర్‌లో సమాచారం పత్రికల్లో వస్తే తన పరువు పోతుంది కాబట్టి.. వాటిని ప్రచురించకుండా ఉండాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తే.. అందుకు అనుగుణంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఎఫ్ ఐ ఆర్‌లోని సమాచారం మీడియాలో రాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.
ఇప్పుడు ఇదే సమాజంలో చర్చకు దారి తీస్తోంది. ఏదైనా నేరం జరిగినప్పుడు దాఖలయ్యేది ఎఫ్ ఐ ఆర్. ఎఫ్ ఐ ఆర్ దాఖలైనంతమాత్రాన నేరం రుజువైనట్టు కాదు. అప్పటి వరకూ ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్న వ్యక్తి నిందితుడే అవుతాడు తప్ప ముద్దాయి కాడు. అయినప్పటికీ.. ఒకసారి ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్న వ్యక్తి గురించి పత్రికల్లో వార్తలు వస్తాయి. ఆ వార్తలు నిందితుడు అని వస్తాయే కానీ ముద్దాయి అని రావు. ఇదేమీ కొత్త విషయం కాదు.. ఆ మాటకొస్తే గతంలో జగన్ విషయంలో ఆయన జైలుకు వెళ్లినా నిందితుడుగానే వెళ్లారు తప్ప ముద్దాయిగా కాదు.
కానీ అప్పట్లో అన్ని మీడియాలు జగన్ జైలుకు సంబంధించి.. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న విషయాల గురించి రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న విషయాల గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు రాశాయి. ఒక్క జగన్ అనే కాదు.. ఏ నేరం విషయంలోనైనా ఇలాగే జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఎఫ్‌ఐఆర్ ల కారణంగా తమ పరువు పోతుందని ఓ వ్యక్తి కోర్టును కోరడం.. సదరు కోర్టు ఎఫ్‌ఐఆర్‌లో విషయాలు పత్రికల్లోనూ, చివరకు సోషల్ మీడియాలోనూ రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం చూస్తే పరువు కేవలం కొందరి హక్కేనా అనిపించకమానదు. అయితే కోర్టులు ఎప్పుడూ తమ ముందుకు వచ్చిన వ్యాజ్యాలనే పరిష్కరిస్తాయి. ఇక ముందు వేరే ఎవరైనా ఎఫ్‌ఐఆర్‌లో తమ పేరు ఉన్నా తమ గురించి పత్రికల్లో రాకూడదని కోర్టును ఆశ్రయిస్తే ఇదే తరహా వెసులుబాటు వారికీ కలిగే అవకాశం ఉండొచ్చేమో.