జగన్ అంటే.. వైఎస్‌ఆర్‌ 2.0.. అంతకుమించి..?

వైఎస్సార్ అంటే.. సంక్షేమానికి మారు పేరు.. అందుకే ఆయన మరణించి దాదాపు 11 ఏళ్లయినా ఇంకా ఆయన పేరు ఏదో ఒక రూపంలో తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబు అభివృద్ధి రాజకీయాలను నమ్ముకుంటే.. సామాన్యుడి దరికి చేరని అభివృద్ధి కంటే.. పేదోడికి సాయంగా నిలిచే సంక్షేమమే తనకు ముఖ్యమని అప్పట్లో వైఎస్సార్ ఆలోచించారు. అందుకే ఆయన ఏ సీఎం చేయని ఆలోచనలు చేశారు.

వైఎస్సార్ ఉచితంగా విద్యుత్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పాలకులూ ఇవ్వక తప్పింది కాదు.. వైఎస్సార్‌ పేదోడికి కూడా కార్పొరేట్ వైద్యం అందించారు. ఆ తర్వాత వచ్చిన పాలకులూ ఇవ్వక తప్పింది కాదు. వైఎస్సార్ నిరుపేద చదువుకునేందుకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత పాలకులూ ఇవ్వక తప్పింది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిందని చెప్పక తప్పదు.

ఇక జగన్ విషయానికి వస్తే.. వైఎస్సార్‌ కు మించి అన్నట్టుగా సాగుతున్నాయి జగన్ పథకాలు.. నిరుపేదల విద్యాలయాలకు ఆయన నాడు నేడు పేరుతో వేల కోట్లు వెచ్చించి ఆధునిక సదుపాయాలు అమర్చుతున్నవైనం నభూతో నభవిష్యతి. పేదల కోసం ఆరోగ్య శ్రీని మరింత మెరుగు పరిచారు. మరిన్ని రోగాలు అందులో చేర్చారు. వెయ్యి రూపాయలు దాటితే చాలు.. ఆరోగ్యశ్రీపై వైద్యం అందిస్తున్నారు. పెన్షన్లు ఇంటికే వస్తున్నాయి.

ఇక ఇప్పుడు కొత్తగా..రైతుల కోసం..వైఎస్సార్ జలకళ అంటూ మరో కొత్త పథకం తెస్తున్నారు. దీని ప్రకారం సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్‌ రిగ్‌ వాహనాలను కేటాయిస్తారు. ఈ పథకానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందిస్తారు. ఈనెల 28న సీఎం దీన్ని ప్రారంభిస్తారు. అసలు ఇలాంటి ఓ పథకాన్ని ఎవరైనా ఊహించారా.. అందుకే వైఎస్ జగన్ అంటే.. వైఎస్సార్ 2.0.. అంతకుమించి.. అంతేగా. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: