హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనాతో ఎంతమంది డాక్టర్లు మరణించారో తెలుసా ?
పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన సమాధానం విన్న ఐఎంఏకి ఒళ్ళు మండిపోయింది. నానా అవస్తలు పడుతు కరోనా ఫ్రంట్ వారియర్స్ అంటూ రోగులకు చికిత్సను అందిస్తు మరణించిన డాక్టర్ల వివరాలు కేంద్రం దగ్గర లేదని చెప్పటం తమను అవమానించటమే అంటూ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ మండిపడ్డాడు. కోవిడ్-19 రోగులకు ఎంతమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది చికిత్సలు చేయిస్తున్నారనే విషయాన్ని సేకరించేందుకు ఐఎంఏ తరపున 1746 శాఖలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికి అందిన వివరాల ప్రకారం చనిపోయిన డాక్టర్ల సంఖ్య 515 అని తేలిందన్నారు. ఈ సంఖ్య మారచ్చని కూడా శర్మ చెప్పటం గమనార్హం. ఐఎంఏ డేటాబేస్ ప్రకారం మనదేశంలో డాక్టర్, రోగి నిష్పత్తి 1: 194గా ఉందన్నారు. అంటే అవసరమైన సంఖ్యలో డాక్టర్లు మనదేశంలో లేరన్న విషయం శర్మ ప్రకటనతో అర్ధమైపోతోంది.
రోగులకు చికిత్సను అందిస్తు అదే వైరస్ సోకి మరణించిన 201 మంది డాక్టర్లు 60-70 ఏళ్ళ మధ్య వయస్సున్న వారిగా శర్మ వివరించారు. మరో 171 మంది డాక్టర్లు 50-60 వయస్సులో ఉన్నట్లు చెప్పారు. 70 ఏళ్ళ పై బడిన డాక్టర్లు 66 మంది, 35-50 మధ్య వయసు డాక్టర్లు మరో 59 మందున్నట్లు చెప్పారు. చివరగా 35 ఏళ్ళలోపు డాక్టర్లు 18 మంది కరోనా వైరస్ తో మరణించటం చాలా దురదృష్టమన్నారు. ఇంతకీ చనిపోయిన డాక్టర్ల డేటా కేంద్రం దగ్గర ఎందుకు లేదంటే ప్రజారోగ్యం, ఆసుపత్రులు రాష్ట్రాల జాబితాలోకి వస్తాయి కాబట్టే తమ దగ్గర చనిపోయిన డాక్టర్ల వివరాలు లేవని చెప్పటం పూర్తిగా నిర్లక్ష్యాన్నే చూపుతోంది. ఇదే కరోనా వైరస్ తో చనిపోయిన, ఆసుపత్రుల్లో చేరిన రోగుల వివరాలు కేంద్రం దగ్గరున్నపుడు వాళ్ళకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది వివరాలు లేవని చెప్పటం పూర్తిగా బాధ్యతారాహిత్యమే.