ఎడిటోరియల్ : బాబు బాటలో జగన్ ? పార్టీ పునాదులకే ప్రమాదకరంగా ?

పాలనాపరంగా చూసుకుంటే, ఏపీ సీఎంగా జగన్ నూటికి నూరుపాళ్లు సమర్థవంతంగానే పని చేస్తున్నారు. ఆయన పాలనకు వంక పెట్టేందుకు అవకాశం లేదు. ప్రతిపక్షాలు జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నా, రాజకీయ ఈ కోణంలోనే జనాలు చూస్తూ, ఇటువంటి విమర్శలన్నీ రాజకీయాల్లో సర్వసాధారణమని పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అదేపనిగా చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నా, తిరిగి వారే విమర్శల పాలవుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి అవినీతిని కట్టడి చేసేందుకు జగన్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, పూర్తిగా అధికారులపై ఆధారపడ్డారు. ఎక్కడా పరిపాలనలో కానీ, ప్రభుత్వ పథకాల విషయంలో గాని, ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా, అధికారుల ద్వారా అన్ని అమలు చేస్తూ వస్తున్నారు.


 జగన్ ఈ విధంగా వ్యవహారాలు చేస్తుండటంపై పార్టీ కేడర్ లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతున్నాయి. అధినేత తమను పట్టించుకోవడం లేదని, తమకు పార్టీలోనూ, ప్రజల్లోనూ, విలువ లేకుండా చేస్తున్నారని, ఇలా అయితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనాల దగ్గర మొత్తం తమ పరువు పోతుంది అని, ఇలా ఎన్నో విశ్లేషణలు చేసుకుంటున్నారు. చాలాచోట్ల ఇదే అంశంపై ఆ పార్టీ నాయకుల్లో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఇదే రకమైన వైఖరితో ఉండే వారు. పూర్తిగా అధికారులపైనే భారమంతా వేసి పరిపాలన సాగిస్తూ, ప్రజాప్రతినిధులను పట్టించుకోనట్టుగా వ్యవహరించేవారు. దీంతో పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు పెరిగిపోయాయి.


చంద్రబాబు ఎవరికి అందుబాటులో ఉండదు అని, కష్టపడి ఆయనను గెలిపిస్తే ఫలితం ఈ విధంగా దక్కిందా అంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులు నిర్వేదంలో ఉండేవారు. చివరికి ఈ వ్యవహారమంతా తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బే కొట్టినట్టయింది. పరిస్థితి ఏమాత్రం బాగాలేదు అనే ఫీడ్ బ్యాక్ జగన్ కు సైతం అందింది. ఎవరికి వారు గ్రూపు తగాదాలతో రచ్చకెక్కుతున్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు సొంతంగా ఆఫీసులో తెరిచారు. అసలు పార్టీ వ్యవహారాలపై జగన్ దృష్టి పెట్టినట్టుగానే వ్యవహరిస్తూ పట్టించుకోవడం మానేశారనే బాధ పార్టీ నాయకుల్లో తీవ్రంగా ఉంది. మొత్తం పరిపాలన పైన దృష్టి పెడితే పార్టీని ఈ స్థాయికి తీసుకు వచ్చిన కార్యకర్తల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.


జగన్ ఇదే వైఖరితో ఉంటే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ దెబ్బతింటుందని, నాయకులెవరూ ఉత్సాహంగా పని చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం అధికార పార్టీ అనే హోదా ఉండడంతో ఎన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నా, సర్దుకుపోతున్నామని చెబుతున్నారు. కానీ ఈ పరిణామాలు ఎప్పటికైనా పార్టీకి చేటు తెచ్చే అంశాలుగానే కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: