హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలుగు రాష్ట్రాల నుండి కేంద్రం ఇదే కోరుకుంటోందా ?
తెలంగాణాలో నిర్మాణం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ లాంటి అనేక సమస్యలపై వివాదం పెరిగిపోతోంది. ఇదే సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీం ఎత్తు పెంచటం, కొత్తగా నిర్మాణం చేయాలని అనుకుంటున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం తదితరాలపై పెద్ద వివాదమే మొదలైపోయింది. ఈనెల 6వ తేదీన జరగబోయే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన విషయాలపై రెండు ప్రభుత్వాలు పూర్తిస్ధాయిలో రెడీ అయ్యాయి. ఈ నేపధ్యంలోనే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండు రాష్ట్రాల మద్య సమస్య పరిష్కారం చేయాల్సిన కేంద్రం రాజకీయ కోణం కూడా ఆలోచిస్తోంది. ఇక్కడే కేంద్రం ఆలోచనేంటో అందరికీ అర్ధమైపోయింది.
కిషన్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. ఇద్దరు సిఎంలు కూర్చుని దావత్ లు ఇచ్చిపుచ్చుకుంటారు, పండగలకు హాజరవుతారు, కలిసి విందులు చేసుకుంటారంటూ కిషన్ అర్ధంలేని వ్యాఖ్యలు చేశాడు. సిఎంల మధ్య ఇంత సాన్నిహిత్యం ఉన్నపుడు సమస్యల పరిష్కారం మాత్రం ఎందుకు చేసుకోలేకపోతున్నారంటూ ఆరోపించటమే విచిత్రంగా ఉంది. జలవివాదాలు సంవత్సరాలపాటు కంటిన్యు అవటంలో కేంద్రం తప్పేమీ లేదని కూడా చెప్పాడు. కిషన్ వాదన ప్రకారం తప్పంతా రాష్ట్రాలదే అన్నట్లుగా ఉంది. సమస్య పరిష్కారం రెండు రాష్ట్రాల మధ్య సాధ్యం కానపుడే కదా పెద్దన్న తరహాలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సింది. మరి తన మధ్యవర్తిత్వం నుండి కేంద్రం పారిపోతే సమస్య పరిష్కారం ఎలాగవుతుంది ?