హెరాల్డ్ ఎడిటోరియల్ : గన్నవరం వివాదాన్ని తేల్చేసిన జగన్..సీనియర్లకు షాక్
ఈ విషయంలోనే వంశీకి పార్టీలోని నేతలకు మధ్య గొడవలు మొదలయ్యాయి. వంశీపై పోటిచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఎంఎల్ఏ పార్టీతో కంటిన్యు అవటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కృష్ణాజిల్లాలోని మంత్రులతో పాటు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా ఉండటంతో యార్లగడ్డ ఏమి చేయలేకపోయారు. కానీ నియోజకవర్గంలో మాత్రం వంశీని వ్యతిరేకిస్తునే ఉన్నారు. దాంతో జగన్ కల్పించుకుని యార్లగడ్డను పిలిపించుకుని మాట్లాడారు. ఇద్దరికీ మధ్య సయోధ్య చేయటంలో భాగంగానే యార్లగడ్డను జిల్లా సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ గా నియమించారు.
వీళ్ళ మధ్య సయోధ్య కుదిరిందని అందరు అనుకుంటున్న సమయంలోనే మరో నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాలు మొదలయ్యాయి. కొంతకాలం వంశీ-దుట్టా వర్గాల మధ్య వివాదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో యార్లగడ్డ కూడా వంశీకి వ్యతిరేకంగా యాక్టివ్ అయ్యారు. దాంతో వంశీ Vs దుట్టా+యార్లగడ్డ వర్గాల మధ్య గొడవలు పెరిగిపోయాయి. దాంతో నియోజకవర్గంలోని నేతలు, శ్రేణుల మధ్య గందరగోళం పెరిగిపోయింది. నిజానికి యార్లగడ్డకు ఛైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఇక వంశీ విషయంలో గొడవ చేయరనే అందరు అనుకున్నారు. కానీ ఇటు పదవీ తీసుకుని అటు ఎంఎల్ఏను మళ్ళీ యార్లగడ్డ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.