ఎడిటోరియల్ : దుబ్బాక ఫలితం టీఆర్ఎస్ కు గుణపాఠమేగా ?

ఇప్పటి వరకు తమకు ఎదురు లేదు అన్నట్లుగా  వ్యవహరించిన తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కు దుబ్బాక ఎన్నికల ఫలితాలు పెద్ద ఎదురుదెబ్బ గానే చెప్పుకోవాలి. అసలు తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతున్న బిజెపి ఈ స్థాయికి రాగలిగింది అంటే అది ఖచ్చితంగా టిఆర్ఎస్ స్వీయ తప్పిదమే కారణం. బిజెపి తమకు ఎక్కడ పోటీ అవుతుందనే భయం టిఆర్ఎస్ నేతలను వెంటాడడం, తెలంగాణలో ఆ పార్టీ బలపడే అవకాశం ఉందని ముందుగానే అనవసర భయాందోళనలకు గురై తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేయడం, ఇలా ఎన్నో కారణాలు టిఆర్ఎస్ కు ఈ పరిస్థితిని తీసుకువచ్చాయి.



 అదే తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉండి ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును రెండు పార్టీలు చీల్చి ఉండేవి. దీంతో టీఆర్ఎస్ కు తిరుగులేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏక పక్షంగా బీజేపీ వైపు ఎన్నికల ఫలితాలు ఉండడంతో, టిఆర్ఎస్ కు రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఈ ఎన్నికలతోనే ఇది ఆగిపోదు. ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలోనూ, అలాగే ఆ తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు, అధికారం దక్కించుకున్నా ఆశ్చర్యపడనవసరం లేదు. ఇది నిజంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద కనువిప్పు  అవుతుంది అనడంలో సందేహం లేదు. 



మొత్తం ఇక్కడ ఎన్నికల బరువు బాధ్యతలు అన్నిటినీ తనమీద వేసుకున్న హరీష్ రావుకు ముఖ్యంగా ఇది ఇబ్బందికర పరిణామమే. ఇక దుబ్బాక నుంచి గెలిచిన రఘునందన్ రావు, సరికొత్త రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం, గతంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా ఉండే మత రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టి, స్థానిక సమస్యల పైన ఎక్కువగా ఫోకస్ చేయడం,  టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాలను హైలెట్ చేయడం ,గత ఎన్నికల్లో ఓటమి చెందినా, నిత్యం ప్రజల్లో ఉండడం, ఇలా ఎన్నో అంశాలు ఆయనకు కలిసి వచ్చాయి. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గురించి చెప్పుకుంటే ఆమె పూర్తిగా రాజకీయాలకు కొత్త కావడం, ప్రసంగం లో తడబాట్లు ఎక్కువగా ఉండడం, టిఆర్ఎస్ నాయకుల్లోనూ  అసంతృప్తి వాదులు ఉండడం , వారంతా బీజేపీకి సహకరించడం, అది కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం, ఆయన టిఆర్ఎస్ ఓట్లను చీల్చడం ,ఇలా ఎన్నో పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చాయి.



 ఇక ముందు ముందు టిఆర్ఎస్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజా వ్యతిరేకత రాకుండా చేసుకోకపోతే ఇబ్బంది పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం దుబ్బాక నుంచి బిజెపి అభ్యర్థి రఘునందన్ 1470 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించినా, ఆ పార్టీ కి కొత్త ఉత్సాహం తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇదంతా బిజెపి నాయకుల సమిష్టి విజయం కాగా,  అధికార పార్టీ టిఆర్ఎస్ కు గెలుపు ధీమా ఎక్కువవడం రాజకీయ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం ఇలా ఎన్నో కారణాలతో ఇప్పుడు టిఆర్ఎస్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: