హెరాల్డ్ ఎడిటోరియల్ : కేసీయారే దుబ్బాకలో బీజేపీని గెలిపించాడా ?
ఇంతకీ కేసీయార్ చేసిన తప్పేమిటి ? ఏమిటంటే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయాలన్నదే కేసీయార్ టార్గెట్ గా పనిచేస్తున్నారు. ఎప్పుడు కూడా ఎన్ని రాజకీయ పార్టీలుంటే అధికారపార్టీకి అంతగా అడ్వాంటేజ్ అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలిసిందే. అందుకనే ఎన్నికల్లో ముగ్గురు, లేకపోతే నలుగురు అభ్యర్ధులు పోటీ చేసిన ఎన్నికల్లో అధికార పార్టీ చాలా సునాయాసంగా గెలుస్తుంటుంది. కానీ ఇక్కడ కేసీయార్ మాత్రం విచిత్రంగా రివర్సులో ఆలోచించటంతోనే దెబ్బ పడిపోయింది. తెలంగాణాలో కాంగ్రెస్ ను తుడిచిపెట్టేయాలన్న ఆలోచన వల్ల బీజేపీని తనంతట తానుగానే తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నట్లయ్యింది. కాంగ్రెస్ ను నేలమట్టం చేస్తే తనకు ఎదురే ఉండదనుకున్నారు కానీ ఆ స్ధానంలో బీజేపీ పుంజుకుంటోందన్న విషయాన్ని గమనించలేదు.
మొన్ననే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున నలుగురు ఎంపిలు గెలిచిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి బీజేపీ గెలుచుకోగలిగిన సీటు సికింద్రాబాద్ మాత్రమే. ఇక్కడ కూడా గెలుస్తు, ఓడుతుంటుంది. కానీ ఏకంగా నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచిందంటే అప్పుడే కేసీయార్ వ్యూహాలు రాంగ్ అవుతున్నాయనే సంకేతాలు కనిపించాయి. కాంగ్రెస్ ఎక్కడైతే బలహీన పడుతోందో అక్కడ జనాలు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ ను కాకుండా బీజేపీని చూస్తున్నారన్న విషయాన్ని కేసీయార్ గ్రహించలేకపోయారు. అదే కేసీయార్ కాంగ్రెస్ జోలికి వెళ్ళకుండా ఉండుంటే ప్రతి నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా త్రిముఖ పోటీ ఉండేదనటంలో సందేహం లేదు.