హెరాల్డ్ ఎడిటోరియల్ : బీహార్లో ఎంతమంది ఎంఎల్ఏల మీద క్రిమినల్ కేసులున్నాయో తెలుసా ?
ఇంతకీ విషయం ఏమిటంటే తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎంతమంది మీద క్రిమినల్ కేసులున్నాయో తెలుసా ? 243 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన 163 మంది మీద అంటే 68 శాతం మందిమీద క్రిమినల్ కేసులున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ద్వారా ప్రపంచం ముందుకొచ్చింది. గెలిచిన వారిలో సుమారు 30 మందిపైన అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, దొమ్మీలు, హత్యాచారాల్లాంటి కేసులు కూడా ఉన్నాయట. పోయిన ఎన్నికల్లో గెలిచిన వాళ్ళల్లో 142 మంది క్రిమినల్ కేసులున్నాయి. అంటే అప్పటికన్నా తాజా ఎన్నికల్లో గెలిచిన వారు అదనంగా 21 మంది యాడ్ అయ్యారని అర్ధమవుతోంది. మరి రెండేళ్ళకన్నా ఎక్కువ జైలుశిక్ష పడిన వారు అసలు పోటీకే అర్హులు కారని ఎన్నికల నియమావళి చెబుతోంది. అయినా ఇన్నేసిమంది పోటీ చేయటమే విచిత్రం అంటే గెలవటం మరింత విడ్డూరంగా ఉంది.
దీనిబట్టి అర్ధమవుతున్నదేమంటే నేరచరితులపైన ఉన్న కేసుల విచారణ సత్వరమే జరగటం లేదని. స్పీడుగా కేసుల విచారణ జరిగిపోయి అంతే స్పీడుతో తీర్పులు కూడా వచ్చేస్తే శిక్షలు పడిన వారెవరైనా ఉంటే ఇక పోటీకే అవకాశం ఉండదు కదా. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కేసులు నమోదైనంత తొందరగా విచారణలు జరిగి శిక్షలు పడవని. ఎందుకంటే కోర్టుల్లో విచారణలు జరుగుతున్నపుడు సాక్ష్యులు విచారణకు హాజరు కావాలంటే భయపడతారు. ఏవో మామూలు కేసుల్లో ఎవరైనా సాక్ష్యులు కోర్టుకొచ్చి సాక్ష్యం చెబుతారేమో. హత్యలు, అత్యాచారాలు, హత్యాచారాలు, దొమ్మీల్లాంటి కేసుల్లో సాక్ష్యులెవరుంటారు ? ఒకవేళ ఉన్నా కోర్టుకొచ్చి బహిరంగంగా ఎవరు సాక్ష్యమిస్తారు ? దీని వల్ల విచారణ సంవత్సరాలు పడుతుంది.