హెరాల్డ్ ఎడిటోరియల్ : డ్రాగన్ వ్యూహాలతో మనకు ఎప్పటికైనా సమస్యేనా ?

Vijaya
డ్రాగన్ దేశం అనుసరిస్తున్న వ్యూహాలతో మనకు ఎప్పటికైనా సమస్యలు తప్పేట్లులేదు. నిజానికి మనకన్నా  డ్రాగన్ దేశం అన్నింటిలోను చాలా బలంగానే ఉంది. ఇందులో భాగంగానే రక్షణ రంగంలో కూడా మనకన్నా బలంగానే ఉంది. తాజాగా 2027 కు అమెరికాకు ధీటుగా తన సైన్యాన్ని పెంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నది. ఇందుకోసం తనకు అవసరానికి మించి, కేటాయింపులకు మించి  రక్షణ రంగానికి బడ్జెట్ ఖర్చులు పెడుతున్నట్లు సమాచారం. అమెరికాను మించి లేకపోతే కనీసం అమెరికా స్ధాయికి చేరుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గట్టిగా డిసైడ్ చేసుకుని దానికి తగ్గట్లుగానే వ్యూహాలు మార్చుకుంటున్నారు. దాంతోనే ఎప్పటికైనా భారత్ కు సమస్యలు తప్పవనే విషయం అర్ధమైపోతోంది.




ఇంతకీ విషయం ఏమిటంటే  2027లో చైనా లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. అప్పటికి ఇపుడున్న చైనా రక్షణ వ్యవస్ధను మరింతగా బలోపేతం చేయాలని జిన్ పింగ్ ఇప్పటి నుండే అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సైన్యాన్ని పూర్తిగా ఆధునీకరించటంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఐఏ) లాంటి సాంకేతికతన నూరు శాతం వినియోగించుకోవాలని తాజాగా నిర్ణయించారు.  ప్రంపంచం మొత్తంలో రక్షణ రంగానికి అత్యంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్నది అమెరికా మాత్రమే. అమెరికా ఏడాది బడ్జెట్ 732 బిలియన డాలర్లు. దాని తర్వాత ఎక్కువ రక్షణ రంగం కేటాయింపులుంటున్నది చైనాకు మాత్రమే. ప్రతి ఏడాది చైనా రక్షణ రంగం బడ్జెట్ కేటాయింపులు 179 బిలియన డాలర్లు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కేటాయింపులకు మించే ఖర్చు చేస్తోంది. 2019లో రక్షణ రంగానికి చేసిన ఖర్చు సుమారు 232 బిలియన్  డాలర్లు. అంటే కేటాయింపులకన్నా చాలా ఎక్కువ ఖర్చు చేస్తోందన్న విషయం అర్ధమైపోతోంది.




భారత్ సరిహద్దుల్లో ప్రతిరోజు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న విషయం అందరు చూస్తున్నదే. గడచిన కొద్ది నెలలుగా డ్రాగన్ దేశం కావాలనే  భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టి గొడవల్లోకి దింపుతోంది. ఇందుకోసం జమ్మూ-కాశ్మీర్ లోని లడ్డాఖ్ ప్రాంతంలోని గాల్వాన్, ప్యాంగ్యాంగ్, సియాచిన్ తదితర ప్రాంతాలను వాడుకుంటోంది. తన రక్షణ రంగం బడ్జెట్ ను పెంచుకోవటం, అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవటం, సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైన్యాల అవసరాలను దగ్గరుండి మరీ చూసుకుంటున్న డ్రాగన్ ప్రభుత్వం మన దేశాన్ని గుక్క తిప్పుకోనీకుండా ఇబ్బందులు పెడుతోంది. అత్యంతాధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలన్నా వేల కోట్ల రూపాయలు ఖర్చులు  చేయాల్సిందే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడే చైనా తన అవసరాలకు మించి  రక్షణ రంగానికి ఖర్చులు పెడుతోంది.




ఎప్పుడైతే డ్రాగన్ దేశం అవసరానికి మించి రక్షణ రంగంపై ఖర్చులు చేస్తోందో భారత్ కూడా ఖర్చులు చేయక తప్పటం లేదు. చైనా ఆర్ధిక వ్యవస్ధ లాంటిది కాదు  మన ఆర్ధిక వ్యవస్ధ. వాళ్ళతో పోల్చుకుంటే మన వ్యవస్ధలో ఎన్నో లోపాలున్నాయి. వాటన్నింటినీ అధిగమించి కేంద్రప్రభుత్వం కూడా రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేయాలంటే తలకు మించిన భారం మోయాల్సిందే. మనదేమో అభివృద్ది చెందుతున్న దేశమైతే చైనా ఏమో బాగా అభివృద్ధి చెందిన దేశం. పైగా కమ్యూనిస్టు దేశం అవటంతో నిర్ణయాలు, అమలు అత్యంత పకడ్బందీగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, అమలు తీరును ఎదురు ప్రశ్నించే అవకాశమే లేదు. కాబట్టి జిన్ పింగ్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. ఇదే సమయంలో మన దేశంలో భిన్నమైన వాతావరణం ఉంది. అందులోను అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఏ విషయంలోను మనం చైనాతో పోటీ పడలేమన్నది వాస్తవం. ఎప్పుడైతే డ్రాగన్ దేశం రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యింది మనకు సమస్య పెరుగుతున్నట్లే భావించాలి. మరి కేంద్రప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: