హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రభుత్వంతో మరో యుద్ధానికి రెడీ అయిపోయారా ?

Vijaya
ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య మరో యుద్ధానికి రంగం సిద్ధమైనట్లే అనిపిస్తోంది.  మొన్నటి మార్చిలో అర్ధాంతరంగా వాయిదాపడిన స్ధానిక సంస్ధలను రాబోయే ఫిబ్రవరిలో నిర్వహించటానికి నిమ్మగడ్డ రెడీ అయిపోయారు. మీడియాకు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో  నిమ్మగడ్డ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ సమస్య బాగా తగ్గిపోయిందట. ఒకపుడు 10 వేలున్న కేసుల సంఖ్య ఇఫుడు 753కి తగ్గిపోయిందన్నారు.  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలు జరుగుతున్నాయని, బీహార్ ఎన్నికలు జరిగిన విషయాన్ని కూడా నిమ్మగడ్డ ప్రస్తావించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎన్నికల నోటిఫికేఫన్ అమల్లోకి వచ్చే నాలుగు వారాల ముందు నుండి కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఎన్నికలకు రెడీ అవ్వాలన్నారు.




నిమ్మగడ్డ జారీ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం చూస్తే ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టటానికి డిసైడ్ అయిపోయినట్లే అర్ధమవుతోంది. మరి ప్రభుత్వమేమో ఎన్నికల నిర్వహణను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని నేరుగా కోర్టుకే చెప్పేసింది. ఇదే సమయంలో కరోనా వైరస్ కారణంగా స్ధానిక ఎన్నికల నిర్వహణలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా లేమని ఉద్యోగ సంఘాలు కూడా చెప్పేశాయి. మరిపుడు ఏమి జరగబోతోంది ? అన్నదే ప్రధాన సమస్యగా మారింది. జరిగేదేముంది నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహించాల్సిందే అని ప్రభుత్వంతో ఓ మాట చెప్పి  నోటీఫికేషన్ కూడా జారీ చేసేస్తారు. అప్పుడు ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని చెబుతుంది. దాంతో నిమ్మగడ్డ మళ్ళీ కోర్టుకెక్కుతారు. ప్రభుత్వంతో మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యలను కూడా నిమ్మగడ్డ నేరుగా కోర్టులో కేసు వేస్తున్న విషయం అందరు చూస్తున్నదే.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏప్రిల్లో రిటైర్ అయ్యేంతలోపు ఎలాగైనా ఎన్నికలను నిర్వహించి తీరాలని నిమ్మగడ్డ పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత వరకు ఎన్నికలను జరపకూడదని ప్రభుత్వం కూడా గట్టిగా నిర్ణయించుకున్నట్లే ఉంది.  మొదట్లోనే నిమ్మగడ్డ గనుక రాంగ్ స్టెప్ వేయకుండా ఉండుంటే బాగుండేది. ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయకుండా ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయం తీసుకునుంటే సరిపోయేది. దాంతో ఒకళ్ళపై మరొకళ్ళు పై చేయి సాధించే క్రమంలో ప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిపోయింది. నిమ్మగడ్డను వెనుక నుండి నడిపిస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డీ బాగానే  ఉన్నారు. మధ్యలో రోడ్డున పడుతున్నది ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ పరువే. ఇప్పటివరకు అయినది సరిపోయనట్లు తొందరలోనే ప్రభుత్వం-నిమ్మగడ్డ మరో సీరియస్ వార్ మొదలయ్యేట్లే ఉంది చూస్తుంటే. చూద్దాం అపుడేమవుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: