హెరాల్డ్ ఎడిటోరియల్ : జారిపోయిన వాళ్ళకోసం చంద్రబాబు తాపత్రయం ?

Vijaya
తెలుగుదేశంపార్టీ మద్దతు నుండి జారిపోయిన బీసీ సామాజికవర్గం వాళ్ళను మళ్ళీ దగ్గరకు తీసుకునేందుకు చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. పదే పదే బీసీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చ గొట్టేందుకు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే వైసీపీ ప్రభుత్వానికి బీసీలు ఊడిగం చేయాలా ? వైసీపీ పల్లకిని బీసీలు మోయాలా ? బీసీ సామాజికవర్గాన్ని వైసీపీ మోసం చేస్తోందనే రకరకాల పద్దతుల్లో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సామావేశాల్లో బీసీలను ఆకట్టుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీ సామాజికవర్గాలను కష్టపడి చంద్రబాబు దూరం చేసుకున్నారు. అధికారంలో ఉన్నపుడు కళ్ళు మూసుకుపోయి బీసీ సామాజకవర్గంలోని సంఘాల నేతలపై నోరుపారేసుకున్నారు.




తమ సమస్యలను చెప్పుకోవటానికి సచివాలయంకు వచ్చిన కొందరు నేతలను బహిరంగంగా అవమానించారు. తనతో పెట్టుకుంటే తోకలు కత్తిరించేస్తానన్నారు. అసలు వీళ్ళని సెక్రటేరియట్ లోకి ఎవరు రానిచ్చారంటూ సెక్యురిటీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురం పర్యటనలో ఉన్నపుడు సమస్యలు చెప్పుకోవటానికి వచ్చిన ఓ నేతతో మాటమాట పెరిగి చెంపపైనే కొట్టారు. ఇటువంటి అనేక ఘటనల తర్వాత చంద్రబాబుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో వాళ్ళలో మెజారిటి సెక్షన్ వైసీపీ వైపు మొగ్గింది. ఒకవైపు చంద్రబాబు చీత్కారాలు, మరోవైపు జగన్ ఆదరణ ను చూసిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో బీసీలు వైసీపీకి ఓట్లేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఘోర ఓటమికి బీసీలు దూరం అవ్వటం కూడా ప్రధాన కారణమనే చెప్పాలి. చరిత్రలోనే ఎప్పుడు ఎదురుకనాంతగా ఓటమి ఎదురు చూడటంతో చంద్రబాబుకు ఒళ్ళు మండిపోయింది. ముందు జనాలను మోసం చేశాడంటూ జగన్ను నానా మాటలన్నారు. తర్వాత వైసీపీకి ఓట్లేసి జనాలు తప్పుచేశారంటూ నిష్టూరాలడారు.




ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక లాభం లేదనుకుని మళ్ళీ ఇపుడు బీసీలకు దగ్గరవుదామని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలే రాంగ్ రూటులో మొదలైనాయి. చేతులారా దూరం చేసుకున్న బీసీలను దగ్గరకు తీసుకోవాలంటే వాళ్ళలో తనపై నమ్మకం పెంచుకోవాలి. అంతేకానీ జగన్ను తిడితే ఏమీ ఉపయోగం ఉండదన్న విషయం మరచిపోయారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏ, ఎంపి స్ధానాల్లో అవసరానికిమించి బీసీలకు టికెట్లిచ్చారు జగన్. బీసీల కోసమే 56 కార్పొరేషన్లు సృష్టించి వాటికి ఛైర్మన్లతో పాటు పాలకవర్గాలను కూడా నియమించారు. మంత్రివర్గంలో కూడా పెద్ద పీటే వేశారు. వాయిదాపడిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జడ్పిటీసీ, ఎంపిటీసీ స్ధానాల్లో బీసీలకు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. తమకు అన్నింటిలోను పెద్ద పీట వేస్తున్న జగన్ను కాదని బీసీలు చంద్రబాబు వైపు ఎందుకొస్తారు ? అధికారంలో ఉన్నంత కాలం బీసీలను దూరంగా పెట్టేసి, ప్రతిపక్షంలోకి రాగానే పార్టీ పదవుల్లో బీసీలకే ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకుంటే నమ్మటానికి బీసీలేమీ అమాయకులు కారని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: