జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి కారణంగా మొత్తానికి కేంద్రప్రభుత్వం దిగొచ్చినట్లే కనబడుతోంది. పోలవరం అంచనా వ్యయాన్ని రూ. 55,548 కోట్లకే ఆమోదిస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పోలవరం అంచనా వ్యయం కొంతకాలంగా బాగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రూ. 55,548 కోట్ల అంచనా వ్యయాన్ని ఒకేసారి 2014 అంచనాల ప్రకారం రూ. 20378 కోట్లకు తగ్గించేస్తున్నట్లు ఆమద్య కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయంపై సంప్రదింపులు జరుగుతునే ఉన్నాయి. రూ. 20,378 కోట్లకు 2017లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి తాజా ప్రభుత్వం పంపిన సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించటం సాధ్యం కాదని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. అయితే కేంద్రం వాదనను రాష్ట్రప్రభుత్వం అంగీకరించలేదు. రెండుసార్లు జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోడితో మట్లాడారు. తర్వాత కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యారు.
తర్వాత ఇదే విషయమై ఆర్ధికమంత్రి, జలవనరుల శాఖల మంత్రులు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, అనీల్ కుమార్ యాదవ్ లు కూడా ఒకటికి రెండుసార్లు కలిశారు. మొత్తానికి కారణాలు ఏవైనా జగన్ ప్రభుత్వం పంపిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను ఆమోదిస్తున్నట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిజానికి ప్రాజెక్టు అంచనా వ్యయంలో సుమారు రూ. 30 వేల కోట్ల పునరావాసం, నష్టపరిహారంకే ఖర్చయిపోతుంది. ఈ విషయంలో గత ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. మొత్తం అంచనా వ్యయంలో దేనికెంత ఖర్చవుతుందని లెక్కలు చెప్పిందే కానీ చేసిన ఖర్చులో పునరావాసం, నష్టపరిహారంకు పెద్దగా ఖర్చు చేయలేదు. దాంతో రోజులు గడిచేకొద్దీ పై ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి నేపధ్యంలో హఠాత్తుగా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్రం తగ్గించేస్తున్నట్లు ప్రకటించటంతో రాష్ట్రప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.
దాంతో జగన్ వెంటనే మేల్కొని మొత్తం ప్రాజెక్టును కేంద్రమే టెకప్ చేయాలంటు గట్టిగా డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలంటూ జగన్ గుర్తుచేశారు. తామడిగినట్లు అంచనా వ్యయాన్ని భరించకపోతే ప్రాజెక్టును వెంటనే కేంద్రం టేకప్ చేయాలంటు అనీల్ కుమార్ కూడా పదే పదే డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తెరవెనుక నుండి కూడా ప్రయత్నాలు చేశారు. మొత్తానికి అన్నీ విధాలుగా చేసిన ప్రయత్నాలు పలించి చివరకు రాష్ట్రప్రభుత్వం డిమాండ్ చేసినట్లు రూ. 55,548 కోట్లకు అంగీకరిస్తు కేంద్ర జలశక్తి ప్రకటించింది. ఇదే సమయంలో తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని కూడా తాజాగా పంపిన అంచనా వ్యయాన్ని కేంద్రం ఆమోదించిందనే ప్రచారం కూడా జరుగుతోంది.