రజనీకాంత్ వెనుకడుగు.. చిరంజీవి, పవన్ కారణమా..?

ఇన్నాళ్లూ పార్టీ పెడతానంటూ ఊరించిన తమిళ సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం సంచలనం కలిగించింది. అనారోగ్యం కారణంగా  పార్టీ పెట్టడం లేదంటూ చేసిన ప్రకటన అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ఎంతో ఆలోచన, ఆవేదన తర్వాత తాను ఈ ప్రకటన చేస్తున్నాని రజినీ చెప్పారు. ఇంతకీ రజనీ కాంత్‌ ఆలోచించింది ఏంటి.. ఎందుకు వెనుకడుగు వేశారు..

ఇప్పుడు ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఆయన ప్రధానంగా అంత్యనిష్టూరం కన్నా.. ఆది నిష్టూరం మేలు.. అని ఫీలైనట్టు తెలుస్తోంది. అనారోగ్యంతో పార్టీ పెట్టి.. దాన్ని సక్సస్‌ చేయలేకపోవడం కంటే.. విరమించుకోవడమే మేలని భావించారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా ఏపీలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌.. తమిళంలో విజయ్‌ కాంత్‌, శరత్ కుమార్ అనుభవాలు ఆయన్ను పునరాలోచనలో పడేసినట్టు తెలుస్తోంది.

ఒకవేళ ఆరోగ్యం సహకరిస్తే.. ఆయన ఇవన్నీ పట్టించుకునేవారు కాకపోవచ్చు.. కానీ.. అరకొర అనారోగ్యంతో వయోభారంతో అనుకున్నది సాధించలేకపోతే.. ఉన్న సూపర్ స్టార్ ఇమేజ్‌ కూడా దూరమవుతుందని ఆయన భావించి ఉంటారని తెలుస్తోంది. రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. ఇక ఇప్పుడు వయోభారం, అనారోగ్యం సమస్యలుగా మారాయి.

ఎందుకంటే.. పదేళ్లుగా రజినీ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. మూడేళ్ల క్రితం ఆయనకు మూత్రపిండ మార్పిడి జరిగింది. రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలు  కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హైబీపీ కూడా వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాజకీయ ప్రవేశం చేయడం, ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని అది ఆయన ప్రాణానికే ప్రమాదమని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ప్రత్యేకించి ఆయన భార్య లత, కూతుళ్లు రజినీ రాజకీయ ప్రవేశాన్ని బాగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. ఇంట్లో వ్యతిరేకత వ్యక్తం కావడం, సన్నిహితులు, శ్రేయోభిలాషులు వారించడంతో రజినీ రాజకీయ ప్రణాళికలను పక్కనపెట్టేశారు. ఏదేమైనా ఆయన శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలన్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: