దేశంలోని రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో రైతుల ఉద్యమాలు జరుగుతున్నాయి. మొదటిదేమో కేంద్రం రూపొందించిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం. ఇక రెండోదేమో గడచిన ఏడాదిగా అమరావతి రైతులు, స్దానికులు చేస్తున్న ఉద్యమం. మొదటి ఉద్యమమేమో నికర్సయిన రైతు ఉద్యమంగా దేశంలో పాపులరయ్యింది. రెండోదేమో రియాల్టర్లు+బ్రోకర్లు+పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉన్న ఉద్యమంగా ఆరోపణలను ఎదుర్కొంటోంది. రెండు ఉద్యమాల్లో ఇంత తేడా ఎందుకుంది ? రెండు ఉద్యమాల విషయంలో ఉద్యమాలకు సంబంధం లేని జనాల ఆలోచనల్లో ఎందుకింత వ్యత్యాసం కనబడుతోంది ? ఎందుకంటే మొదటిదేమో యావత్ దేశంలోని రైతాంగానికి సంబంధించిందిగా అందరు ఓన్ చేసుకుంటున్నారు.
అందుకనే ఉద్యమం మొదలైంది పంజాబులోనే అయినా తర్వాత హర్యానా, మహారాష్ట్ర, రాజస్ధాన్, పశ్చిమబెంగాల్ కు కూడా పాకింది. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ వద్ద గడచిన 39 రోజులుగా జరుగుతున్న రైతుసంఘాల ఉద్యమ సెగ కేంద్రానికి గట్టిగా తగులుతోంది. అందుకనే పదే పదే రైతులతో కేంద్రమంత్రులను చర్చలకు పంపుతోంది. సరే అంతిమంగా ఏమవుతుందన్నది పక్కన పెట్టేస్తే రైతుఉద్యమం యావత్ దేశంలోని జనాల సానుభూతి పొందిందన్నది వాస్తవం. మరి ఇదే సమయంలో అమరావతిలో ఉద్యమం మీద ఎందుకిన్ని రకాలుగా ప్రచారం జరుగుతోంది ? ఎందుకంటే ఇది టీడీపీ స్పాన్సర్డు ఉద్యమంగా ముద్రపడిపోయింది. పైగా అమరావతి పరిధిలో రాజధాని కోసం సేకరించిన భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు, రియాల్టర్ల ప్రభావం, టీడీపీ ప్రముఖుల తెరవెనుక జోక్యం లాంటి అనేక కారణాల వల్ల ఉద్యమాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. చివరకు అమరావతి పరిధిలోని ఆరేడు గ్రామాల జనాలు తప్ప ఇంకెవరు ఉద్యమాన్ని పట్టించుకోవటం లేదు.
ఢిల్లీ ఉద్యమంలో రైతులు నరేంద్రమోడిని ఎక్కడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం లేదు. అదే అమరావతిలో ఉద్యమం పేరుతో ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తునే మరోవైపు తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని గోల చేయటం అమరావతి ఉద్యమకారులకే చెల్లింది. రెండు ఉద్యమాల్లో ప్రధాన తేడా ఇపుడు అర్ధమైందా ?