చంద్రబాబుకు ఏమైంది.. ఆ మతాన్ని అంతగా అవమానిస్తున్నారు..?

నిన్న మొన్నటి వరకూ ఏపీలో రాజకీయాలు కులం చుట్టూ తిరిగాయి. అమరావతిలో ఒక కులం వాళ్లే ఉన్నారని వైసీపీ రచ్చ చేసిందని టీడీపీ విమర్శించింది. ఆ తర్వాత ఏ కులాన్ని ఎవరు ఎన్ని పదవులు ఇచ్చారన్న లెక్కలపైనా చర్చ జరిగింది. జగన్ రెడ్డి తన సొంత కులానికే పదవులు ఇస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. కానీ.. ఇప్పుడు ఏపీలో రాజకీయం సీన్ మారిపోయింది. కులం నుంచి ఇప్పుడు సీన్ మాతానికి వచ్చేసింది.

రామతీర్థం ఘటనలో ఈ మత రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఏపీలో బీజేపీకి ఎక్కడ లాభం జరుగుతుందో అన్న శంకతో చంద్రబాబు కూడా ఇటీవల మతంపై హద్దులు మీరి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన సీఎం, మంత్రులు, అధికారులకు కూడా మతం ఆపాదిస్తూ విమర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ, చివరకు విజయనగరం ఎస్పీ అంతా క్రిస్టియన్లే అంటున్నారు చంద్రబాబు.

అంతే కాదు.. రామతీర్థం ఘటన దర్యాప్తు బాధ్యతను సీఐడీకి ఇచ్చారని.. దాని అధిపతి క్రైస్తవుడైన సునీల్‌కుమార్‌ అని చంద్రబాబు అంటున్నారు. అంతా క్రిస్టియన్లే ఉన్నారని.. అయినప్పుడు హిందూ దేవాలయాలు, దేవుళ్లపై దాడులు జరగకుండా జాగ్రత్తగా చూడాలని సలహాలు ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఏపీలో బీజేపీ జోరు చూసి తాను కూడా మత రాజకీయాలకు దిగుతున్నారు.

మరి.. చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు క్రైస్తవాన్ని కించపరచడం కాదా.. ఈ రకంగా క్రైస్తవ మతాన్ని, ఆ మతానికి చెందిన అధికారులను అగౌరవపర్చవచ్చా? అధికారులు మతం ప్రకారం ఉద్యోగంలోకి వచ్చారా? మతాల ప్రకారం బాధ్యతలు నిర్వహిస్తారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే.. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు క్రైస్తవ సభలకు కూడా  వెళ్లారు.. ఏసు అంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప దేవుడు అని చెప్పిన రోజులూ ఉన్నాయి. మరి అలాంటి చంద్రబాబు ఇలా క్రిస్టియన్లను కించపరచడం విడ్డూరంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: