భూమా జగద్విఖ్యాత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగానే ఉంది. చిన్న వయస్సులోనే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం కిడ్నాప్ డ్రామాలో పాలు పంచుకున్నాడని సమాచారం. వారం రోజుల క్రితం బోయినపల్లిలోని ముగ్గురు రియాల్టర్ సోదరుల కిడ్నాప్ వ్యవహారం అందరికీ తెలిసిందే. కిడ్నాప్ చేయటానికి పక్కా ప్లాన్ వేసిన గ్యాంగ్ తర్వాత దాని అమలులో ఫెయిలవ్వటంతో కిడ్నాప్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కిడ్నాప్ వ్యవహారంలో సూత్రదారి మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ తో పాటు అతని సోదరుడు చంద్రహాస్ అండ్ 15 అదర్స్ అని అనుకున్నారు. కానీ భూమా కుటుంబంలో యువకెరటం భూమా జగద్విఖ్యాత్ రెడ్డి కూడా కీలకమేనని పోలీసులు తాజాగా గుర్తించారు.
కిడ్నాప్ వ్యవహారంలో భూమా కుటుంబసభ్యులు కాకుండా మరో 15 మంది కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు. వీరిలో ఇఫ్పటికి నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళల్లో ఓ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇంతకీ ఈ డ్రైవర్ ఎవరయ్యా అంటే జగద్విఖ్యాత్ రెడ్డి కారు డ్రైవరట. అతను చెప్పిన సమాచారం ప్రకారమే జగద్విఖ్యాత్ రెడ్డి కూడా కిడ్నాప్ వ్యవహారంలో చాలా కీలకమని పోలీసులు గుర్తించారు. గ్యాంగ్ లోని మిగిలిన వాళ్ళకు ఆదేశాలివ్వటం, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవటం బావమరిది పనేనట. పైగా కిడ్నాప్ జరిగిన సమయంలో బావమరిది కూడా తన కారులో ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు పోలీసులకు డ్రైవర్ చెప్పాడట. దాంతో బావమరిది మొబైల్ నెంబర్ సిగ్నల్, మొబైల్ కాల్ డేటా మొత్తాన్ని పరిశీలించిన పోలీసులకు డ్రైవర్ చెప్పింది నిజమే అని నిర్ధారణయ్యిందట.
బావ కోసం బావమరిది కిడ్నాప్ వ్యవహారంలోకి దిగటం ఇదే మొదటిసారి కాదని పోలీసులు గుర్తించారు. నంద్యాలలోనే ఓ మిల్క్ డైరీ ఛైర్మన్‌ను కూడా ఇద్దరు కలిసి కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించారు. అయితే అది కూడా చివరి నిముషంలో ఫెయిలైంది. ఆ విషయమై ఇద్దరిపైనా పోలీసుల దగ్గర కేసు కూడా నమోదయ్యుంది. ఇది వదిలేస్తే ఇంకా చిన్నా చితకా ఆరోపణలు యువకెరటం మీద చాలానే ఉన్నాయట. ఏదేమైనా బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావమరిది ఏమి చేయటానికైనా వెనకాడేది లేదన్న విషయం మరోసారి నిరూఫణైంది. అందుకనే బావ+బావమరిది ఇద్దరు పరారీలోనే ఉన్నారు. బావేమో మహారాష్ట్రలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బావమరిది ఆచూకీనే ఇంకా దొరకలేదు. ఒకసారంటు బావమరిది కూడా దొరికిపోతే బావ గురించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో.