హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలుగు రాష్ట్రాలకు ఇందుకేనా కేంద్రం నిధులు కేటాయించనిది ? .. నేతలకు షాక్
కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అగ్రనేతలు ఆశలు వదిలేసుకున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లో చాలా రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించిన ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలుగురాష్ట్రాలకు మాత్రం మొండిచెయ్యే చూపించారు. కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు మంజూరు చేయలేదంటేనే బీజేపీ అగ్రనేతల వైఖరి అర్ధమైపోతోంది. తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేసీయార్ ఎప్పటి నుండో అడుగుతున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇదే సమయంలో ఏపిలో పోలవరం ప్రాజెక్టుకు నిధులు అడుగుతుంటే కూడా కేంద్రం లెక్క చేయటంలేదు.
ఇది కాకుండా విజయవాడ, వైజాగ్ లో మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా నిధులు కావాలని రాష్ట్రం నుండి ప్రతిపాదనలు వెళ్ళినా కేంద్రం పట్టించుకోలేదు. తాజా బడ్జెట్లో కేరళ, బెంగుళూరు, చెన్నైలో మెట్రో ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేశారు. చెన్నై మెట్రోకు రూ. 62 వేల కోట్లను, కేరళ మెట్రోకు రూ. 14 వేల కోట్లు, బెంగుళూరు మెట్రోకు రూ. 17 వేల కోట్లను మంజూరు చేసింది. ధక్షిణా రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రమంత్రి మరి తెలంగాణా, ఏపిలను మాత్రం ఎందుకు వదిలేసింది ? ఎందుకంటే కేరళ, తమిళనాడులో తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి జనాలను మాయ చేయటానికే పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది.
ఇక తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి ఏపి విషయం చూస్తే బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనుచూపుమేరలో కనబడటం లేదు. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో డిపాజిట్ వస్తుందనే నమ్మకం కూడా కమలనాదులకు లేదు. ఏదో పైకి పులివేషం వేస్తున్నా లోగుట్టు ఏమిటో అందరితో పాటు బీజేపీ నేతలకు కూడా బాగా తెలుసు. సో ఏపి అభివృద్ధికి నిధులు కేటాయించినా క్రెడిట్ మొత్తం వైసీపీ ప్రభుత్వానికే వెళుతుంది కానీ బీజేపీకి వచ్చే లాభం ఏమీలేదు. అంటే నిధులు ఇచ్చినా ఉపయోగం ఉండదు, ఇవ్వకపోయినా కొత్తగా జరిగే నష్టం ఏమీలేదు. కాబట్టే ఏపి నుండి ఎన్ని ప్రతిపాదనలు వెళుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదు. దీన్నిబట్టి చూస్తే తెలుగురాష్ట్రాలపై బీజేపీ ఆశలు వదిలేసుకున్నట్లే ఉంది. మరి రేపటి ఎన్నికల్లో బడ్జెట్లో జరిగిన అన్యాయాన్ని బీజేపీ నేతలు ఎలా సమర్ధించుకుంటారో చూడాల్సిందే.