హెరాల్డ్ ఎడిటోరియల్ : తెలంగాణాపై షర్మిల క్లారిటి ఇచ్చేసినట్లేనా ?
తెలంగాణ జిల్లాల్లోని రాజన్న మద్దతుదారులు, అభిమానుల ద్వారా గ్రౌండ్ లెవల్లో ఉన్న ప్రజాభిప్రాయాలు వినేందుకే తాను సమావేశమవుతున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సమావేశంలో చెబుతు తాను మాట్లాడటానికి సమావేశం పెట్టలేదని, కేవలం వినటానికి మాత్రమే సమావేశం పెట్టినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మార్చిలో కొత్త పార్టీని షర్మిల ప్రకటించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కోసం ఓ న్యాయనిపుడితో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. సమావేశానికి సంబంధించి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. షర్మిల ఇంటి ముందు పెద్ద ఎత్తున భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల్లో షర్మిల, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఏ ఫ్లెక్సీలో కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఫొటో లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
నిజానికి జగన్ మైనస్ విజయమ్మ, షర్మిల=జీరో అన్న విషయం అందరికీ తెలిసిందే. మరలాంటిది జగన్ ఫొటో లేకుండానే షర్మిల, వైఎస్సార్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు వెలిశాయంటే అర్ధం ఏమిటి ? ఇంకో పాయింట్ ఏమిటంటే షర్మిల ఆత్మీయ సమావేశానికి సంబంధించిన ప్రచారం జగన్ మీడియాలో కనబడకపోవటమే. దినపత్రికలో కానీ టీవీలో కానీ ఎక్కడా సమావేశానికి సంబంధించిన చిన్న వార్త కానీ విజువల్స్ కానీ కనబడలేదు. దీన్నిబట్టి జగన్ కు సంబంధం లేకుండానే షర్మిల సమావేశం జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో వైసీపీని విస్తరించే విషయంలో జగన్ వ్యతిరేకమన్నారు. వైసీపీని తెలంగాణాలో కూడా విస్తరించాలని అనుకుంటే ఏపిలో నమ్ముకున్న జనాలకు పూర్తి న్యాయం చేయలేనని జగన్ భావించినట్లు చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణాలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తేవాలన్నది షర్మిల ఆలోచనగా సజ్జల చెప్పారు.