రాజకీయాల నుండే కాకుండా ప్రజా జీవితం నుండి కూడా తప్పుకుంటున్నట్లు చిన్నమ్మగా ప్రచారంలో ఉన్న శశికళ చేసిన ప్రకటన తమిళనాడులో సంచలనంగా మారింది. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు జీవితం గడిపి శశికళ ప్రజా జీవితంలోకి వచ్చిందే రాజకీయాల్లో చక్రం తిప్పటానికి. జైలు నుండి విడుదలయ్యేందుకు ఆమె ఏకంగా రూ. 10 కోట్ల జరిమానాను సైతం చెల్లించేందుకు వెనకాడలేదు. విడుదలవ్వటం ఆలస్యం బెంగుళూరు నుండి చెన్నై వరకు భారీ ఎత్తున కాన్వాయ్ తో తన బలప్రద్శన చేశారు. మామూలు జనాలే కాదు చివరకు అధికార అన్నాడీఎంకేలో కూడా తనకు బలమైన మద్దతుదారులున్నట్లు ప్రచారం చేయించుకున్నారు. అందుకనే పార్టీకి తానే జీవితకాలపు ప్రధాన కార్యదర్శినంటు ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ తనదేనంటు నానా రచ్చ చేశారు.
ఇంత చేసిన శశికళ హఠాత్తుగా రాజకీయాల నుండేకాక ప్రజాజీవితం నుండి కూడా ఎందుకు తప్పుకున్నట్లు ? తమిళనాడుకు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రయిపోయి ఏలుదామా ? అని ఇంతకాలం ఎదురు చూసిన చిన్నమ్మ నుండి ఇలాంటి ప్రకటన వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఉరుములేని పిడుగులాగ చిన్నమ్మ ప్రకటన జారీ అవటాన్ని ఆమె మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రకటన వెనుక ఏమి జరిగుంటుందనే విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. దాని సారంశం ఏమిటంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కారణంగానే శశికళ ఇలాంటి ప్రకటన చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఏఐఏడీఎంకేని హస్తగతం చేసుకోవాలన్న చిన్నమ్మ ప్రయత్నాలకు అమిత్ అడ్డుకొట్టినట్లు సమాచారం. అన్నాడీఎంకే+బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఎలాగూ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పెట్టిన పార్టీ ఉందికాబట్టి ఆ పార్టీనే మరో మిత్రపక్షంగా చేర్చుకోవటానికి తమకు అభ్యంతరం లేదని అధికారపార్టీ జనరల్ సెక్రటరీ+సీఎం పళనిస్వామి హోంమంత్రితో స్పష్టంగా చెప్పారట. ఇదే విషయాన్ని చిన్నమ్మతో అమిత్ చెప్పి అధికారపార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో షాక్ కు గురైన శశికళకు ఏమి చేయాలో అర్ధంకాక చివరకు రాజకీయాల నుండే తప్పుకుంటున్నట్లు ప్రకటించారట. మరి నిజంగానే శశికళ రాజకీయాల నుండి తప్పుకుంటున్నారా ? లేకపోతే ఎవరినైనా బెదిరించేందుకు ఇలాంటి ప్రకటన చేశారా అన్నది ఆసక్తిగా మారింది.