హెరాల్డ్ ఎడిటోరియల్ : బీజేపీ ఓటమికి కారణమేమిటో తెలుసా ?

Vijaya
గెలిచేస్తాం..పొడిచేస్తామని బీజేపీ నానా గోల చేసిన ఎన్నికల్లో అభ్యర్ధి ఓడిపోయారు. అభ్యర్ధి ఓటమిపై పార్టీ నేతలు సమావేశం పెట్టుకుని పోస్టుమార్టమ్ చేశారు. అందులో టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు ఇతర అభ్యర్ధుల్లోని లోపాలు, ప్లస్సలుకన్నా బీజేపీలోని మైనస్సులే ఎక్కువగా బయటపడ్డాయట. అంటే పార్టీ నేతలు పోస్టుమార్టమ్ ను కాస్త నిజాయితీగానే విశ్లేషించుకున్నట్లే అనుకోవాలి. ఇంతకీ బీజేపీ ఓటమికి దారితీసిన కారణాలు ఏమిటి ? ఏమిటంటే చాలానే ఉన్నాయట. మొదటిది కేంద్రప్రభుత్వంపై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత. రెండోది పార్టీ నేతల మధ్య సమన్వయలోపం. మూడోది అభ్యర్ధి ఎలక్షనీరింగ్ లో వెనకబడిపోవటం. నాలుగోది అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెమటోడ్చి పనిచేయటం.




మొదటి కారణం తీసుకుంటే ఈ విషయంలో అభ్యర్ధి చేయగలిగేదేమీలేదు. ఎందుకంటే గ్యాస్, పెట్రోలు, డీజల్ ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. ఒకవైపు ధరలు పెరిగిపోతున్నా కేంద్రప్రభుత్వం తనకేమీ సంబంధం లేదని సమర్ధించుకుంటోంది. ఈ విషయంలోనే జనాలు మోడి అంటేనే మండిపోతున్నారు. దాని ఫలితమే బీజేపీ అభ్యర్ధిపై పడింది. ఇక పార్టీ నేతల మధ్య సమన్వయం కూడా కొట్టొచ్చినట్లు కనబడిందట. అభ్యర్ధికి అండగా నేతలందరు ఏకతాటిపై పనిచేయలేదు. చాలామంది నేతలు ఏదో మొక్కుబడిగా ప్రచారం చేశామంటే చేశామనిపించారట. పట్టభద్రుల స్ధానానికి జరిగిన హైదారబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఓటర్ల విషయంలో బీజేపీ పెద్దగా కసరత్తు చేయలేదు.




ఇదే విషయంలో టీఆర్ఎస్ బ్రహ్మాండంగా పనిచేసింది. ఎలాగంటే ఓటర్లను చేర్పించటం, ఓటర్లతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటం, పోలింగ్ రోజున ఓటర్లను ఓట్లేసేందుకు తీసుకురావటం లాంటి ఎలక్షనీరింగ్ వల్లే టీఆర్ఎస్ గెలిచింది. ఇవే విషయంలో బీజేపీ అభ్యర్ధి ఫెయిలయ్యారు. 2015 ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో 55 శాతం మాత్రమే ఓటింగ్ జరిగితే తాజా ఎన్నికల్లో 78 శాతానికి పెరిగింది ఓటింగ్. ఒక్కసారిగా 23 శాతం ఓటింగ్ పెరగటానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహమే అని ఇపుడు బీజేపీకి అర్ధమైంది. చివరగా కేసీయార్ కు వ్యతిరేకంగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ చాలా ఓవర్ గా రెచ్చిపోతున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే బీజేపీని పట్టడం కష్టమని కేసీయార్ కు అర్ధమైపోయింది. అందుకనే గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు నేతలందరినీ రంగంలోకి దింపారు. దాంతో అందరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసి పార్టీ అభ్యర్ధిని గెలిపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: