ఎలాగైనా బీజేపీ జెండాను ఎగరేయాలనే పట్టుదలతో ఒకటికి పదిసార్లు ఇప్పటికే ప్రచారం చేశారు. తన లెఫ్టినెంట్ అయితే అక్కడే క్యాంపు వేసినట్లుగా తిరుగుతున్నారు. ఇంత కష్టపడుతున్నా నరేంద్రమోడికి షాక్ తప్పేట్లులేదు. ఇప్పటికే విషయం అర్ధమైపోయుంటుంది ఇదంతా పశ్చిమబెంగాల్ ఎన్నికల గురించేఅని. అవును పదేళ్ళుగా అధికారంలో ఉన్న మమతాబెనర్జీని ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి చాలా పట్టుదలతో ఉన్నారు. అందుకనే ఇప్పటికే సుమారు ఐదుసార్లు ప్రచారం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే అవకాశం దొరికినపుడల్లా బెంగాల్లోనే క్యాంపేస్తున్నారు. ఇక జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా+ఇతర ప్రముఖులంతా అహోరాత్రులు కష్టపడుతున్నారు. అయితే వీళ్ళెంత కష్టపడుతున్నా బీజేపీ గెలిచే అవకాశం దాదాపు లేదని తేలిపోయింది.
దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్న బెంగాల్ ఎన్నికల్లో ఒకవైపు మమతాబెనర్జీ, మరోవైపు నరేంద్రమోడి సైన్యాలు మోహరించాయి. ప్రధానికి మద్దతుగా చాలామందే రంగంలోకి దిగారు. అయితే మమత మాత్రం దాదాపు ఒంటరిపోరాటమే చేస్తున్నట్లు లెక్క. వీళ్ళిద్దరు కాకుండా కాంగ్రెస్+వామపక్ష కూటమి కూడా పోటీలో ఉన్నా వాళ్ళ ప్రభావం పెద్దగా ఉండదని సర్వేల్లో తేలిపోయింది. అందుకనే మమత-మోడి చావో రేవో అన్నట్లుగా పోరాటం చేస్తున్నారు. మమతను ఎలాగైనా దెబ్బకొట్టాలన్న ప్లానుతోనే బీజేపీ ప్రలోభాలకు తెరతీసింది. మమతకు చాలా సన్నిహితంగా ఉన్న సుబేందు అధికారి కుటుంబంతో పాటు చాలామందిని లాగేసుకున్నది. అయినా పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనబడటం లేదు.
మమతను దెబ్బకొట్టేందుకు ప్రోత్సహించిన ఫిరాయింపులే బీజేపీ కొంప ముంచేట్లుంది. ఇదే సమయంలో మమత వ్యూహాత్మకంగా లోకల్-నాన్ లోకల్ అనే నినాదాన్ని బలంగా తీసుకెళుతోంది. బీజేపీ గెలిస్తే మోడి అండ్ కో ది పరాయిపాలనే తప్ప లోకల్ పాలన కాదని ఒకటికి పదిసార్లు పదే పదే చెబుతున్నారు. స్ధానిక సెంటిమెంటును తిప్పికొట్టడానికి మోడి, అమిత్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని ప్రకటించకపోవటమే నష్టం చేస్తోంది. ఈ విషయాన్నే మమత బాగా ఎత్తిచూపుతున్నారు. మొత్తానికి మోడి, అమిత్ ఎంత కష్టపడినా రాబోయే ఎన్నికల్లో బీజేపీకి షాక్ తప్పేట్లులేదు. కాకపోతే బీజేపీ బలం మూడు సీట్ల నుండి 100 సీట్లకు పెరుగుతుందనే అంచనాలే ఊరటనిస్తున్నాయి.