హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాలే టీడీపీని బహిష్కరించారా ?

Vijaya
‘పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించటం కాదు..ప్రజలే టీడీపీని బహిష్కరించారు’.. ఇది తాజాగా మంత్రి పేర్నినాని చెప్పిన డైలాగ్.  తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో మంత్రి మీడియా సమావేశంలో చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బహిష్కరణ గురించి మంత్రి ఏ పద్దతిలో చెప్పినా ఆ విషయం మాత్రం వాస్తవమే అనేట్లుంది. మొన్నటి సాధారణ ఎన్నికల దగ్గర నుండి ఈమధ్యే జరిగిన మున్సిపల్ ఎన్నికలను జాగ్రత్తగా పరిశీలిస్తే మంత్రి చెప్పింది నిజంగా నిజమే అనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో 175 సీట్లకు గాను టీడీపీకి వచ్చింది 23 సీట్లు మాత్రమే. గెలుపోటములు ఏ పార్టీకైనా సహజమే అయినా మరీ ఇంత ఘోరంగా టీడీపీ ఎప్పుడూ ఓడిపోలేదు. థ్యాంక్స్ టు చంద్రబాబు లీడర్ షిప్.



ఓటమిలో కూడా నాలుగు జిల్లాల్లో టీడీపీ నూరుశాతం తుడిచిపెట్టుకుపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క అసెంబ్లీని కూడా టీడీపీ గెలవలేదు. దీంతోనే జనాలు టీడీపీని ఏ స్ధాయిలో బహిష్కరించారో అర్ధమైపోతోంది. ఈ ఫలితాలు చూస్తే పేర్నినాని చెప్పింది నిజమే అని ఒప్పుకోవాల్సిందే. అలాగే పంచాయితి ఎన్నికలను తీసుకుంటే ఇందులో కూడా చాలా జిల్లాల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోయారు. ఇక తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలను తీసుకుంటే ఇంకా అన్యాయం. 75 మున్సిపాలిటిలకు ఎన్నికలు జరిగితే తాడిపత్రి మినహా మరే మున్సిపాలిటిలో కూడా టీడీపీ గెలవలేదు. మరిక్కడ కూడా జనాలే తమ్ముళ్ళను బహిష్కరించినట్లు కదా.



ఇదే విధంగా ఎన్నికలు జరిగిన 12 మున్సిపల్ కార్పొరేషన్లలో 11 కార్పొరేషన్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక్క కార్పొరేషన్లో కూడా జనాలు టీడీపీకి మెజారిటి డివిజన్లను ఇవ్వలేదు. అంటే కార్పొరేషన్లలో కూడా జనాలు టీడీపీని బహిష్కరించినట్లే లెక్క. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఫలితం ఎలాగుంటుందో ఎవరు చెప్పలేకున్నారు. వైసీపీయేమో 5 లక్షలకు తగ్గకుండా మెజారిటి రావాలని కష్టపడుతోంది. టీడీపీయేమో మొన్నటి ఎన్నికల్లో తెచ్చుకున్న 4.9 లక్షల ఓట్లు తెచ్చుకుంటే అదే గెలిచినంతగా అవస్తలు పడుతోంది. ఒకవేళ మొన్నటి ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్లు తెచ్చుకోలేకపోతే ఓటర్లు టీడీపీని బహిష్కరిచింనట్లే అనుకోవాలి. అయితే హఠాత్తుగా పరిషత్ ఎన్నికల వేడి రాజుకుంది. ఈనెల 8వ తేదీన జరగబోయే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే ఎంత ? బహిష్కరిస్తే ఎంత ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: