హెరాల్డ్ ఎడిటోరియల్ : గాజు గ్లాసే బీజేపీ కొంప ముంచేస్తుందా ?

Vijaya
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీకి గాజుగ్లాసు దెబ్బ పడబోతోందా ? ఇపుడిదే ప్రశ్న అందరినీ అయోమయంలో పడేసింది. గాజుగ్లాసు అంటేనే పవన్ కల్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీ ఎన్నికల గుర్తని అందరికీ తెలిసిందే. కమలం+గాజుగ్లాసు ఇపుడు మిత్రపక్షాలే. అయినా కమలానికి గ్లాసు నుండి సమస్యలు మొదలయ్యేట్లుంది. ఇంతకీ విషయం ఏమిటంటే  గాజుగ్లాసు గుర్తును ఎన్నికల సంఘం నవతరం పార్టీ అభ్యర్ధికి కేటాయించింది. దీంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. ఎన్నికల గుర్తులు గతంలో కూడా పార్టీల తలరాతలను మార్చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా తెలంగాణాలో టీఆర్ఎస్ గుర్తు కారుపై ఇలాంటి దెబ్బలా బాగా పడ్డాయి. టీఆర్ఎస్ గుర్తు, స్వతంత్ర అభ్యర్ధుల జీపు లేదా ట్రాక్టర్ గుర్తులు కేటాయించటంతో కొన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బేపడింది.


తాజా ఎన్నికల్లో అలాంటి సమస్యే బీజేపీ ఎదుర్కోబోతోందనే టెన్షన్ మొదలైపోయింది. నిజానికి ఓ పార్టీ ఎన్నికల గుర్తును ఇంకొక పార్టీకి గానీ లేదా స్వతంత్ర అభ్యర్ధులకు గానీ ఇచ్చేందుకు లేదు. అయితే ఇక్కడ జనసేన వ్యవహారం వేరుగా ఉంది. ఎలాగంటే జనసేనకు గుర్తింపు పొందిన రాజకీయపార్టీ హోదా ఇంకా రాలేదు. దాంతో ఆ పార్టీ ఎక్కడైనా ఎన్నికల్లో పోటీచేస్తుంటే అదే గుర్తును ఇతర పార్టీలకు లేదా వ్యక్తులకు కేటాయించారు. కానీ ఇక్కడ జనసేన పోటీ చేయటంలేదు. మిత్రపక్షమైన బీజేపీకి మద్దతిస్తోందంతే. కాబట్టి పోటీలో ఉన్న వ్యక్తులు, లేదా పార్టీలు కోరుకున్న గుర్తును ఎన్నికల సంఘం కేటాయించవచ్చు. ఆ పద్దతిలో నవతరం పార్టీ తరపున పోటీ చేస్తున్న గోదా రమేష్ కుమార్ కు గాజుగ్లాసు కేటాయించారు.



తిరుపతి లోక్ సభ పరిధిలో బీజేపీ పరిస్ధితి అసలే అంతంతమాత్రంగా ఉంది. అందుకనే జనసేన అధినేత పవన్ను పట్టుకుని ఊగుతోంది. పవన్ ప్రచారం కారణంగా కాస్త బీజేపీకి ఊపిరి వచ్చినట్లుగా ఫీలవుతున్నారు ఆ నేతలు. ఇలాంటి పరిస్దితుల్లో నవతరం పార్టీ అభ్యర్ధికి జనసేన ఎన్నికల గుర్తయిన గాజుగ్లాసును కేటాయించటం ఇబ్బందిగా మారిందని కమలనాదులు భావిస్తున్నారు. పవన్ అభిమానులు కమలానికి కొట్టాల్సిన ఓటును గాజుగ్లాసుకు కొడితే తమ కొంప ముణిగిపోతుందని టెన్షన్ పెరిగిపోతోంది. తమ పార్టీ గుర్తును ఇంకో పార్టీకి కేటాయించటానికి వీల్లేదని జనసేన నేతలు అభ్యంతరాలు చెబుతున్నా అవి చెల్లుబాటు కావటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: