వాటే ఐడియా: ఓపెన్‌ ఎయిర్‌ జైలులో.. జగన్ హిట్‌లిస్ట్ టీడీపీ లీడర్స్..!

సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడిని జైళ్లో పెట్టించడం.. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జైలుపాలు కావడం, తాజాగ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడం.. విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాలు కూల్చడం.. ఇలా.. జగన్ తన అధికారాన్ని ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపునకే వాడుతున్నారట.

ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చాలా ఆవేదన చెందుతున్నారు. కరోనా రాష్ట్రంలో విజృంభిస్తున్నా జగన్ అదేమీ పట్టకుండా టీడీపీ నేతల కక్ష సాధింపునకే టైమ్ అంతా వినియోగిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాధి సోకుతున్న వారి సంఖ్య రోజుకు 12 వేలకు పెరిగినా అదేమీ పట్టని ప్రభుత్వం తెల్లవారకముందే వందల మంది పోలీసులను పంపి తెలుగుదేశం నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేయించిందని తన తాజా కొత్త పలుకు శీర్షికలో విమర్శించారు రాధాకృష్ణ.

రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన కేసును ఇప్పుడు తిరగదోడి నరేంద్రను హడావిడిగా అరెస్ట్‌ చేశారంటేనే ముఖ్యమంత్రిలో కక్ష సాధింపు వైఖరి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అధికారాన్ని ఈ స్థాయిలో దుర్వినియోగం చేయవచ్చునని గత పాలకులకు తెలియదని... నిజానికి రాజకీయాల్లో గతంలో కక్ష సాధింపు ధోరణులు ఉండేవి కావని... ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే ధోరణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల అధికారానికి లొంగిపోతున్న ముఖ్యమంత్రులు తమ సొంత రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆక్రోశిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులందరినీ ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్‌ చేసే వరకు జగన్‌రెడ్డికి నిద్ర పట్టేట్టు లేదంటున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అందుకు ఆయన ఓ అద్భుతమైన ఐడియా ఇస్తున్నారు. ముఖ్యమంత్రి హిట్‌లిస్టులో ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ స్వచ్ఛందంగా జైలుకు వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందట. తెలుగుదేశం నాయకులు అందరినీ ఒక మైదానంలో నిర్బంధించి దాన్నే ఓపెన్‌ ఎయిర్‌ జైలుగా మారిస్తే జగన్‌రెడ్డి శాంతించవచ్చని సూచిస్తున్నారు ఆంధ్రజ్యోతి ఆర్కే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: