ఆ టీవీ9 రిపోర్టర్‌పై అదిరిపోయే మీమ్స్.. అసలు కథ ఇదీ..!?

ఇది సోషల్ మీడియా యుగం. ఏ చిన్న ఘటన జరిగినా దాని చుట్టూ అనేక సెటైర్ పోస్టులు, మీమ్స్ క్షణాల్లో సిద్ధం అవుతుంటాయి. కొందరు టీవీ యాంకర్లు, రిపోర్టర్లు కూడా కొన్ని సార్లు ట్రోలింగ్‌కు గురవుతుంటారు. అయితే ఆ ట్రోలింగ్‌ల వెనుక కొన్ని బాధలు, కష్టాలు ఉంటాయి. తాజాగా టీవీ9 రిపోర్టర్ అశోక్ వేములపల్లికి అలాంటి అనుభవమే ఎదురైంది. దాన్ని ఆయన తన ఫేస్ బుక్ పేజ్‌లో పంచుకున్నారు. అసలేంజరిగిందే...

అశోక్‌ వేములపల్లి
......................

మొన్న ఒక రోజు నేను మాస్క్ పెట్టుకోలేదని సోషల్ మీడియాలో  వచ్చిన మీమ్స్ ఇవి.. ఇంతలా కష్టపడి నాకు పబ్లిసిటీ ఇచ్చి.. శునకానందం పొెంది కాస్త నా ఫొటో చూపించి నాలుగు చిల్లర పైసలు ఏరుకున్న మీమ్స్ దారులకు, వాటిని షేర్ చేసి పైశాచికానందం పొందిన కొంతమంది జర్నలిస్టులు, ఇతరులకు నేను చెప్పేదేమంటే..

 అయ్యా.. నాకు ఇటీవలే కరోనా పాజిటివ్ వచ్చి పధ్నాలుగు రోజులు ఇంటి దగ్గరే చికిత్స తీసుకుని తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాను.. అప్పటి నుంచి మాస్క్ పెట్టుకుని నాన్ స్టాప్ గా లైవ్ ఇస్తుంటే లేదా రిపోర్టింగ్ చేస్తుంటే శ్వాస అందడం లేదు.. ఇది కరోనా తర్వాత వచ్చిన చిన్నపాటి సమస్య..అందులోనూ నేను కాస్త బిగ్గరగా లైవ్ లో మాట్లాడతాను..దానికి తోడు గ్యాప్ లేకుండా మాట్లాడతాను..ఇందువల్ల కొన్నిసార్లు ఊపిరి అందడం లేదు. అందుకే లైవ్ ఇచ్చేపుడు అందులోనూ ఎక్కువసేపు ఎక్స్ ప్లెయిన్ చేయాల్సిన వచ్చినపుడు అది కూడా నేను మాత్రమే ఉండి జనాలకు దూరంగా ఉన్నపుడు ఇలా మాస్క్ తీస్తున్నాను..అంతేగాని ఒళ్లు బలిసి నా ముఖారవిందాన్ని మీకు చూపించడానికి కాదు..

నిజానికి కరోనా పాజిటివ్ వచ్చాక నా హార్ట్ బీట్ 118 చూపిస్తోంది .. గుండెల్లో విపరీతమైన దడ ఉంటోంది .. కొద్దిసేపు మాట్లాడితే విపరీతమైన ఆయాసం వస్తోంది .. నాన్ స్టాప్ గా లైవ్ లో మాట్లాడితే ఊపిరి అందక ఆగిపోతుందేమో అనిపిస్తోంది ఇవన్నీ ఎవడికీ తెలియవు కదా ??        


నేనేమీ మానవాతీతుడిని కాదు. ఈ భూమ్మీద మూడొందల ఏళ్లు బతకను..ఇలాంటి కరోనా టైంలో ఎప్పడు ఊపిరి పోతుందో తెలీని పరిస్థితుల్లో పని చేస్తున్నాను..చాలామందితో పాటు ఈ కరోనా టైంలోనే నా శరీరం ఏదోఒకరోజు శ్వాస ఆగి మార్చురీకి తరలిపోవొచ్చు కూడాను.. పొట్టకూటికోసం, బతుకుదెరువు కోసం..అన్నీ తెలిసినా పని చేస్తున్నాను.. కరోనా టైంలో జనాలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు జర్నలిస్టుగా నేను ఎన్నో వార్తలు కవర్ చేశాను.. నా వల్ల నా వార్తల వల్ల ఏ ఒక్కరికి మేలు జరిగినా జీవితానికి అదో తెలీని సంతృప్తి.. నేను ఈ కరోనా టైంలో ఎవ్వరూ వెళ్లడానికి కూడా సాహసం చేయని చోట్లకు వెళ్లి మరీ రిపోర్ట్ చేస్తున్నాను.. ఇవేమీ ఈ క్రాస్ బ్రీడింగ్ గాళ్లకు అక్కర్లేదు..

సరే ..ఈ శాడిస్టుల సూచన,ఏడుపులు , పెడబొబ్బల తర్వాత  తర్వాత లైవ్ లోనూ మాస్క్ పెడుతున్నాను..కానీ ఇవాళ లైవ్ ఇచ్చేపుడు  కూడా లైవ్ మధ్యలో శ్వాస అందలేదు.. తీవ్రమైన ఇబ్బంది పడ్డాను..కానీ తప్పడం లేదు.. డాక్టర్లై అడిగితే కరోనా తర్వాత కొద్దిరోజులు ఈ సమస్య ఉంటుందని చెప్పారు .. అలాగని ఇంకా కొన్నిరోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే నా ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు ?? సంస్థ కూడ ఎన్నిరోజులు ఇంట్లో కూర్చోబెట్టి జీతమిస్తుంది ?? అందుకే బతుకు పోరాటం , ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మళ్లీ వచ్చి పనిచేయాల్సి వస్తోంది .. నేను కూడా డబ్బున్నోడిని అయితే ఇంకో నెల ఇంట్లోనే కూర్చుని పూర్తిగా కోలుకున్నాకే డ్యూటీకి వచ్చ్చేవాడిని .. కానీ ఏ నెల కు ఆనెల ఒకటోతేదీ ఎప్పుడొస్తుందా .. జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే మధ్యతరగతి వాళ్లల్లో నేనూ ఒకడిని ..

మీమ్స్ చేసే సైకోలకు భయపడో ఈ పనికిమాలిని వాటిని చూసి ఆందోళ చెందో ఈ వివరణ ఇవ్వడం లేదు.. ఎందుకంటే మీ మీమ్స్ వల్ల నాకు మరింత పబ్లిసిటీ పెరిగింది కూడాను..పైగా ఇదేమీ దేశం ద్రోహం కాదు మానభంగం అంతకన్నా కాదు.. మీమ్స్ చేయండి..అవి ఇతరులు ఎంజాయ్ చేసేలా కాసేపు నవ్వుకునేలా..కానీ అవతలి వాళ్ల జీవితాల్ని కించపర్చేలా కాదు..ఆ మీమ్స్ ని షేర్ చేయండి.. కానీ జనాలకు ఉపయోగపడేవాటిని చేయండి..పనికిమాలిని వాటిని కాదు..
-అశోక్ వేములపల్లి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: