కేసీఆర్పై యుద్ధం: ఈటల + కొండా + రేవంత్ + ఆ ఇద్దరు ?
తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసమేనా.. అని బాధపడేవారు తెలంగాణలో చాలా మంది ఉన్నా.. వారెవరికీ తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తగిన ప్రత్యామ్నాయమే లేదు. కాంగ్రెస్ సంగతి తెలిసిందే.. నాయకులు ఎక్కువ.. వ్యూహాలు తక్కువ. ఇక బీజేపీ ఏదో కుమ్మేస్తుందనుకుంటే దాని పరిస్థితీ అంతే.. ఇక మిగిలిన పార్టీల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈటల రాజేందర్ కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేసీఆర్ చేతిలో అవమానానికి గురై.. అన్యాయంగా గెంటేశారని భావిస్తున్న ఈటల ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేక కూటమి కట్టేందుకు పావులు కదుపుతున్నారు. అయితే అందంత సులభం కాదన్న సంగతి ఈటలకూ తెలుసు. కానీ.. ఇది ఈటలకు జీవన్మరణ సమస్య. కేసీఆర్ పై పోరాటం చేయడం తప్ప వేరే ఆప్షన్ ఈటలకు లేదు. దీనికి తోడు తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేని లోటు కూడా ఈటలకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈటలకు మద్దతుగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి జతకలిశారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం చూస్తే... ఈటలతో ఇద్దరు మంత్రులు కూడా టచ్లోకి వచ్చారట. కేసీఆర్కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తాను, ఈటల మరికొంత మంది ప్రయత్నిస్తున్నామని విశ్వేశ్వరరెడ్డి చెబుతున్నారు. కేసీఆర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా వ్యతిరేకత ఉందన్నారాయన. అంతే కాదు.. తమ ఆలోచనలకు రేవంత్రెడ్డి మద్దతు కూడా ఉందని విశ్వేశ్వరరెడ్డి చెబుతున్నారు. మరో రెండు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఈటల ప్లస్ కొండా ప్లస్ రేవంత్ ప్లస్ ఇద్దరు మంత్రులు.. ఇదీ ఇప్పటికే ఈటల బలం. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.