హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు తక్షణమే చేయాల్సిన పనేంటో తెలుసా ?

Vijaya
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంతకాలమైనా జనాలను మభ్యపెట్టి, మాయచేసి కాలం గడిపేయచ్చనే అనుకుంటున్నారు. అయితే తన రాజకీయాలకు కాలం చెల్లిందని ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చినా చంద్రబాబు మాత్రం ఏమాత్రం తీరు మార్చుకోవటంలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని శాపనార్ధాలు పెట్టడం, రాజీనామా చేసేయమని డిమాండ్ చేయటం, ఏదో ఒక కారణాన్ని దొరికించుకుని ప్రభుత్వంపై బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నారు. అంటేకానీ వాస్తవాలు ఏమిటి ? అనే దానితో సంబంధంలేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా నారా లోకేష్ వైజాగ్ ట్రిప్పులో జరిగిన ఘటనే చంద్రబాబు, లోకేష్ తీరు ఎలాగుందో చెప్పటానికి పనికొస్తుంది.




నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ చనిపోయిన విషయాన్ని పెద్దగా రాజకీయం చేద్దామని లోకేష్ అనుకున్నారు. వెంటనే విశాఖపట్నంలో వాలిపోయారు. నేరుగా సుధాకర్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఇదే సమయంలో జగన్ పై నోటికొచ్చింది మాట్లాడేశారు. తర్వాత డాక్టర్ తల్లి మాట్లాడుతు జగన్ దేవుడని సీఎంపై తమకెలాంటి కోపం లేదని ప్రకటించింది. తమస్య సమస్యల్లా స్ధానిక నేతలతో అని స్పష్టంగా చెప్పారు. దాంతో లోకేష్+టీడీపీ నేతలకు నోటమాట పడిపోయింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదానికి చంద్రబాబు, లోకేష్ ఆలోచనలకు ఎంత తేడా ఉందో తెలిసిపోతోంది.




ఇక్కడే చంద్రబాబు మరచిపోతున్న విషయం ఒకటుంది. జగన్ను తిట్టడానికి, బురదచల్లేయటానకి, విమర్శలు చేయటానికి వెచ్చించే సమయాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగిస్తే బాగుంటుంది. చంద్రబాబు తన దృష్టిని జగన్ పైనుండి తప్పించేయాలి. ముందు పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించుకోవాలి. గ్రామస్ధాయి నుండి పార్టీని బలోపేతం చేయటానికి సూచనలు, సలహాలు తీసుకోవాలి. పార్టీలోని గట్టి నేతలను వెతికి పట్టుకోవాలి. వృద్ధనేతలు, పార్టీకి భారంగా తయారైన వాళ్ళని వదిలించుకోవాలి. కేవలం మీడియాలో మాత్రమే కనబడే నేతలను పక్కనపెట్టేయాలి. జగన్ పాలనపై జనాల్లో వ్యతిరేకత రానంతవరకు చంద్రబాబు ఎంత గొంతుచించుకున్నా ఏమాత్రం ఉపయోగం ఉండదు గొంతునొప్పి తప్ప. జగన్ పై జనాల్లో వ్యతిరేకత ఇప్పుడిప్పుడే వచ్చేట్లు లేదు. కాబట్టి సమయం కోసం వెయిట్ చేయాల్సిందే తప్ప చంద్రబాబుకు వేరేదారిలేదు. ఈలోపు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడమే ఉత్తమం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: