అవును ఈ విషయమే జనాలకు అర్దం కావటంలేదు. ఎక్కడైనా నేరం జరిగినపుడు సూత్రదారులు, పాత్రదారులందరినీ పట్టుకుంటారు, విచారిస్తారు. జరిగిన నేరంలో సూత్రదారులు, పాత్రదారుల పాత్రలెంతవరకు ఉన్నాయనే విషయమై చార్జిషీటులో వివరిస్తారు. ఏదో క్షణికావేశంలో జరిగే కొన్ని నేరాల్లో తప్ప ప్రీప్లాన్డుగా జరిగే నేరాల్లో సూత్రదారుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నేరం చేసినవాడిదే కాదు చేయించిన వాడిది కూడా అంతే తప్పని పోలీసులు చెబుతునే ఉంటారు. అందుకనే సూత్రదారులు+పాత్రదారులందరిపైనా పోలీసులు కేసులు పెట్టి కోర్టు బోనెక్కిస్తారు. కానీ తాజగా ఈడీ దాఖలు చేసిన ఓటుకునోటు కేసులో కేవలం పాత్రదారులను మాత్రమే నిందితులుగా చెప్పి అసలు సూత్రదారిని మాత్రం వదిలేసింది.
2015లో జరిగిన తెలంగాణా ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని చంద్రబాబునాయుడు అండ్ కో ప్లాన్ చేశారు. నిజానికి ఏ రకంగా చూసినా వేం గెలిచే అవకాశమే లేదు. అయినా సరే పోటీకి ఎందుకు దిగారో ఎవరికీ అర్ధంకాలేదు. అయితే నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటుకు రు.5 కోట బేరం పెట్టి, రు. 50 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చేక్రమంలో అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అప్పటికి కానీ వేం గెలుపుకోసం చంద్రబాబు అండ్ కో వేసిన స్కెచ్ అర్ధంకాలేదు. టీఆర్ఎస్ ఓట్లను డబ్బులుపెట్టి గెలవాలన్నది చంద్రబాబు అండ్ కో వేసిన ప్లాన్ గా కేసీయార్ మండిపోయారు. తన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నట్లు కేసీయార్ ఆరోపణలు అందరికీ తెలిసిందే. రేవంత్ ను పట్టుకున్న తర్వాత మరో ఎంఎల్ఏ సండ్రవెంకటవీరయ్య, స్టీఫెన్ తో మాట్లాడించి, ఒప్పందం కుదిర్చిన జెరూసలెం మత్తయ్య, సెబాస్టియన్, వేం కొడుకు కృష్ణకీర్తనరెడ్డి అందరినీ ఏసీబీ అరెస్టులు చేసింది.
ఈ కేసులో చంద్రబాబు పాత్రను తేల్చేందుకు ఏసీబీ విచారణకు నోటీసులు కూడా ఇచ్చింది. అయితే చంద్రబాబు వెంటనే హైకోర్టుకెళ్ళి విచారణ జరక్కుండా స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుండి కేసు నత్తనడక నడుస్తునే ఉంది. దాదాపు ఆరేళ్ళ దర్యాప్తు తర్వాత తాజాగా ఈడీ దాఖలుచేసిన చార్జిషీటులో పాత్రదారులందరినీ నిందితులుగా చేర్చింది. అయితే అసలు సూత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు పేరుమాత్రం ఎక్కడా కనబడలేదు. రు. 5 కోట్ల బేరం తర్వాత స్టీఫెన్ సన్ తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబు ఇచ్చిన హామీతోనే స్టీఫెన్ ముందుకెళ్ళారు. ఫోన్లో మాట్లాడింది చంద్రబాబే అని పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారణచేసినట్లు తర్వాత ఏసీబీ హైకోర్టుకి చెప్పింది. మొత్తం కేసులో సూత్రదారి చంద్రబాబే అని అందరు అనుకుంటున్న సమయంలో కేసుతో చంద్రబాబుకు సంబంధమే లేదన్నట్లుగా ఈడీ చార్జిషీటులో చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.