హెరాల్డ్ ఎడిటోరియల్ : జనాల దృష్టిలో ‘జనకంటకుడు’ ఎవరు ?
తాజాగా అచ్చైన కొత్తపలుకును సాంతం చదివితే ఇదే అనుమానం వస్తోంది. మీడియా రంగంలో చాలా సంవత్సరాలుగా ఉన్న ఎల్లోమీడియా యాజమాని ఒక్కరోజు కూడా నిష్పక్షపాతంగా వార్తలను కానీ కథనాలను కానీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్నవ్యక్తి పరిపాలనలో తప్పుచేస్తే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబునాయుడు చేసిందంతా ఒప్పు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నదంతా తప్పని నానా గోల చేస్తుండటంలోనే ఆయన అనుసరిస్తున్న మీడియా ప్రమాణాలు అర్ధమైపోతోంది. ఎల్లోమీడియాలో 24 గంటలు, 365 రోజులు చంద్రబాబును రక్షించటం, జగన్ పై బురద చల్లటమనే టార్గెట్ పెట్టుకున్న విషయం చాలాకాలం క్రితమే జనాలకు అర్ధమైపోయింది. అందుకనే ఈ మీడియాలో వచ్చిన వార్తలు, కథనాలను జనాలు నమ్మటం ఎప్పుడో మానేశారు. దీనికి సాక్ష్యమే ఇటీవల జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం.
తాజాగా రాసిన చె(కొ)త్తపలుకులో ఆకాశమే హద్దుగా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం అర్ధమైపోతోంది. జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో ఆరోపణలు చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే జనాలను నమ్మించి మళ్ళీ టీడీపీకి ఓట్లేయించుకుని అధికారంలోకి రావాలనేది చంద్రబాబు వ్యూహంగా సరిపెట్టుకోవాలి. కానీ అదే ప్రయత్నం ఎల్లోమీడియా కూడా చేస్తోందంటే అర్ధమేంటి ? చంద్రబాబు మాటలను జనాలు నమ్మటంమానేసి చాలా కాలం అయిందన్న విషయం అందరికీ తెలుసు. చంద్రబాబుకు మద్దతిస్తున్న కారణంగానే ఎల్లోమీడియాను కూడా జనాలు పట్టించుకోవటంలేదు. జగన్ పాలనలో తప్పుని తప్పుగాను ఒప్పుని ఒప్పుగానే చెప్పగలిగితే జనాలు స్వాగతిస్తారు. అంతేకానీ తమకు మంచి జరిగే నిర్ణయాలను తీసుకున్నపుడు కూడా తప్పులు పట్టడాన్ని జనాలు ఎలా నమ్ముతారు.