సాక్షి భేష్.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే ఫాలో ఐతే బెటర్..!

ఒకప్పుడు బతకలేక బడి పంతులు అనే వారు. ఇప్పుడు అదే మాట జర్నలిస్టులకు వర్తించే పరిస్థితి ఉంది. జర్నలిస్టులంటే సమాజంలో గౌరవం తగ్గుతోంది. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రత్యేకించి ఈ కరోనా కాలంలో ఎందరో పాత్రికేయులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా జర్నలిస్టులను కరోనా స్ప్రెడర్స్ గా గుర్తించారు.

మీడియా సంస్థలు కూడా కరోనా సమయంలో జర్నలిస్టులను ఆదుకోవడం లేదు. చాలా సంస్థలు జర్నలిస్టులను ఉద్యోగాల్లో నుంచి తీసేశాయి. మరికొన్ని జీతాలు తగ్గించాయి. అయితే సాక్షి పత్రిక తాజాగా ఓ విధానం ప్రకటించి మిగిలిన మీడియా సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. దీని ప్రకారం.. సాక్షి మీడియా తన పత్రిక, తన టీవీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు.. అంటే జర్నలిస్టులే కాదు, ఇతర సిబ్బంది కూడా.. కరోనాతో మరణిస్తే ఆ కుటుంబాలకు ఆసరాగా నిలవడం కోసం రూ. 25 వేలు అంతకంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు  ప్రస్తుత జీతాన్ని ఏడాదిపాటు నెలనెలా చెల్లిస్తారు. రూ. 25 వేలు ఆ పైన ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు రూ. 25 వేలు ఏడాది పాటు ప్రతినెలా చెల్లిస్తారు.

అంటే.. కనీసం ఓ ఏడాదిపాటు ఆ కుటుంబానికి గరిష్టంగా 25 వేల చొప్పున చెల్లిస్తారు. ఇవి కాకుండా  గ్రూప్ టరమ్ లింక్ ఇన్స్యూరెన్స్ కింద 4 లక్షలు, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ కింద 7 లక్షలు కూడా కంపెనీ చెల్లిస్తుంది.. ఇక ఎఫ్, గ్రాట్యుటీ, ఫుల్, ఫైనల్ సెటిల్‌మెంట్ ఎలాగూ ఉంటుంది. అయితే.. ఈ గ్రూప్ టరమ్ లింక్ ఇన్స్యూరెన్స్, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్  మిగిలిన కొన్ని సంస్థలు కూడా ఇస్తున్నా.. ఏడాది పాటు జీతం చెల్లించడం మాత్రం ఎక్కడా లేదు.

ఇలా సాక్షి ఓ కొత్త మంచి సంప్రదాయానికి నాంది పలికింది. ఇదే సాంప్రదాయాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వంటి మీడియా సంస్థలు కూడా పాటిస్తే మంచిది. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లూ రేయంబవళ్లు పని చేసిన ఉద్యోగులకు ఇలాంటి సాయం చేయడం ద్వారా ఆయా సంస్థల గౌరవం పెరుగుతుంది. మిగిలిన మీడియా సంస్థలు కూడా ఆలోచిస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: