కేసీఆర్ ఇకపై ఫార్మ్‌హౌస్ వదలి ప్రజల్లోకి వెళ్లనున్నారా...?
అందుకు తగినట్టుగానే ఆయన రాజకీయ వ్యూహ రచన సాగుతోంది. తనదైన శైలిలో సంక్షేమ కార్యక్రమాలకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. సాగునీటి పథకాల ద్వారా తెలంగాణ రైతుల స్థితిగతులను టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎలా మార్చిందీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు.
అంతేకాదు.. తాను ఫార్మ్‌హౌస్ నుంచే పరిపాలన సాగిస్తానని, ప్రజల్లోకి వెళ్లనని విపక్షాలు చేసే ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టే ప్రయత్నమూ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన సీఎం అయిన ఏడేళ్లలో తొలిసారిగా గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. అంతేకాదు పీపీఈ కిట్ ధరించకుండానే అక్కడ కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న వార్డులకు వెళ్లి వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా విపక్షాలను,అధికారులను కూడా కేసీఆర్ ఆశ్ఛర్య పరిచారు. ఈటెల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత ఆ శాఖను తనదగ్గరే ఉంచుకోవడం ద్వారా ప్రజారోగ్యానికి తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన సంకేతాలు పంపారు. కరోనా ప్రభావం తగ్గాక ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు ఆయన ప్రణాళిక రచించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి హరీష్‌రావును మరోసారి ఆయన పార్టీ ప్రచార రథసారథిగా వినియోగించుకోనున్నట్టు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ రెండేళ్ల ముందునుంచే ఎన్నికల యుద్ధానికి అస్త్రశస్త్రాలనన్నింటినీ సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుండగా ఆయనను దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏ వ్యూహంతో ముందుకెళతాయో చూడాల్సి ఉంది.