రేవంత్ రూపంలో బాబోరి హవా ?
రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి.. చంద్రబాబు సూచనల మేరకే కాంగ్రెస్‌లోకి వెళ్లారన్న టాక్ అప్పట్లోనే ఉంది. ఆ తర్వాత కూడా అదే రేవంత్ - చంద్రబాబు కలిసి చర్చించుకునే 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న పరిస్థితి. చంద్రబాబు ఆ ఎన్నికల్లో మొత్తం రేవంత్ గైడెన్స్ లోనే ముందుకు వెళ్లారు. ఎలాగైనా కేసీఆర్‌ను గద్దె దింపాలనే కలిసి పనిచేశారు. అయితే కేసీఆర్ మళ్లీ ఆంధ్రోళ్ల పాలన వస్తుందన్న సెంటిమెంట్ రగిల్చేసి చంద్రబాబును బూచీగా పెట్టుకుని మరోసారి సులువుగా గెలిచేసి.. తెలంగాణకు వరుసగా రెండోసారి సీఎం అయ్యారు.
ఆ తర్వాత కూడా చంద్రబాబు రాహుల్ గాంధీకి రేవంత్ కే టీ పీసీసీ పదవి ఇవ్వాలని సిఫార్సు చేశారు కూడా.. ! అయితే ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో చంద్రబాబును జాతీయ స్థాయిలో ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక కేసీఆర్‌పై ఎలా రివేంజ్ తీర్చు కోవాలా ? అని ఉన్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ రేవంత్ రూపంలో తెలంగాణ రాజకీయాల్లో పరోక్షంగా వేలు పెడతారన్న చర్చలు అయితే స్టార్ట్ అయ్యాయి. తెలంగాణలో రెండో సారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఇక్కడ చంద్రబాబుకు చిన్న పనులు కూడా జరగడం లేదు.
ఇక ఇప్పుడు రేవంత్ లాంటి తన ప్రియశిష్యుడు రాజకీయంగా ముందుకు వస్తే... ఇక్కడ టీడీపీ కేడర్, తన అనుచరగణంతో మరోసారి తనదైన పాత్ర పోషించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇక తెలంగాణలో బాబు సామాజిక వర్గం, టీడీపీ కేడర్ సైతం రేవంత్ కు టీ పీసీసీ రావడాన్ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.