మోడీ దెబ్బతో.. సోషల్ దిగ్గజాలు దారికొచ్చినట్టేనా..?
అయితే.. ఈ సోషల్ మీడియా ఓ పద్దతి ప్రకారం పని చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఐటీ చట్టాన్ని తీసుకొచ్చింది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారం 50లక్షలకు పైగా వినియోగ దారులను కలిగి ఉన్న సంస్థలు ప్రతినెలా పారదర్శక నివేదికను విడుదల చేయాలి. తమకు వచ్చిన ఫిర్యాదులతో పాటు..వాటిపై తీసుకున్న చర్యలపై ఆయా సంస్థలు నెలవారీ నివేదికలో ప్రచురించాలి. కొన్ని సంస్థలు దీన్ని పాటించడానికి మొదట్లో విముఖత ప్రదర్శించాయి. కానీ కేంద్రం ఉండుంపట్టు పట్టడంతో అవి క్రమంగా ఈ కొత్త ఐటీ చట్టాన్ని పాటించక తప్పడం లేదు.
తాజాగా నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా సామాజిక మాద్యమ దిగ్గజాలు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ చర్యలు తీసుకున్నాయి. తమ మాధ్యమాల్లో ప్రమాదకరంగా ఉన్న పోస్టులను తొలగించినట్లు ఆయా దిగ్గజ సంస్థలు నెలవారీ పారదర్శక నివేదికను విడుదల చేశాయి. మే 15 నుంచి జూన్ 15 మధ్య నిబంధనలకు విరుద్ధంగా 10 కేటగిరీల కింద ఉన్న 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్ చెప్పింది. 9 కేటగిరీలకు చెందిన 20లక్షల పోస్టులపై చర్యలకు ఉపక్రమించినట్లు ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.
ఇక స్థానిక చట్టాలు, వినియోగదారుల హక్కులకు భంగం కల్గినట్లు గూగుల్, యూట్యూబ్ నుంచి ఏప్రిల్‌లో 27వేల 762 ఫిర్యాదులు అందినట్లు గూగుల్ సంస్థ వెల్లడించింది. మొత్తం మీద.. 59వేల350 పోస్టులను తొలగించినట్లు గూగుల్ తెలిపింది. దిగ్గజ సోషల్ మీడియా సంస్థలు కొత్త ఐటీ చట్టం అమలు చేస్తుండటాన్ని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా స్వాగతించారు.