చంద్రబాబు.. ఆ ఒక్క విషయంపై మాత్రం నోరు విప్పడం లేదుగా..?

ఏపీలో మళ్లీ చంద్రబాబు యాక్టివ్ అయ్యారు. పార్టీ నేతలను వరుసగా పరామర్శిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర వంటి నేతల కుటుంబాలను పరామర్శకు వెళ్లారు. అయితే కేవలం పరామర్శలతో సరిపెట్టకుండా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. జగన్ సర్కారు తీరును ఏకిపారేస్తున్నారు. ఈ విమర్శలతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.


తాజాగా పెడన నియోజకవర్గంలో  బంటుమిల్లి మండలం నాగేశ్వరరావు పేట చేరుకున్న చంద్రబాబు.. పెడన ఇంచార్జి కాగిత కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు మరణించిన  సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించారు. ఇదంతా బాగానే ఉంటోంది. అయితే.. జగన్ సర్కారు గురించి అన్ని రకాలుగా విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. ఏపీ, తెలంగాణ జల వివాదంపై మాత్రం పెద్దగా స్పందించడం లేదు. సముద్రంలోకి నీరు పోతుంటే జగన్ రెడ్డి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు... కేసీఆర్ కు ఒక్క ఫోన్ చేసి మాట్లాడే ధైర్యం కూడా లేదా అని చంద్రబాబు విమర్శించారు.


తెలంగాణకు కావాల్సిన విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చి నీటి వృధాని అరికట్టలేడా.. జల్సాలు, అవినీతి తప్ప ఈ ముఖ్యమంత్రికి ఏం తెలుసు అని చంద్రబాబు అన్నారు. అంత వరకే మాట్లాడుతున్న చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. కేసీఆర్‌ వైఖరిపై ఒక్క మాట మాట్లాడే ధైర్యం కూడా చేయడం లేదు. గతంలో నదుల అనుసంధానం నాదే, నోట్ల రద్దు నాదే అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు కేసీఆర్‌ను నిలదీయడం లేదో అర్థం కాని పరిస్థితి.


ఎలాగూ తెలుగు దేశం తెలంగాణలో దాదాపు ఖాళీ అయ్యింది. ఇక ఇప్పుడు కేసీఆర్ సర్కారును విమర్శంచినా.. తెలంగాణ వైఖరిని తప్పుబట్టినా కొత్తగా తెలుగు దేశం కోల్పోయేదేమీ లేదు. అయినా చంద్రబాబు ఈ విషయంలో స్పందించడం లేదు. బహుశా.. హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల గురించే కాస్త ఆలోచిస్తున్నారేమో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: