ఆంధ్రజ్యోతికి.. బాబు ఎంత భూమి చౌకగా ఇచ్చారో బయటపెట్టిన సాక్షి..!
ఇటీవల ఆంధ్రజ్యోతి అధనేత రాధాకృష్ణ కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. మాకు అక్రమంగా భూములిస్తే జగన్ ఏం చేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వమేగా చర్యలు తీసుకోవచ్చుగా అంటూ సవాల్ కూడా విసిరారు. దీని ఫలితంగానో ఏమో.. ఇప్పుడు సాక్షి పత్రిక ఆంద్రజ్యోతి పత్రికకు గత టిడిపి ప్రభుత్వం అతి తక్కువ ధరకు భూమిని కేటాయించిందంటూ ఓ కథనం ప్రచురించింది. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చెందిన ఆమోద పబ్లికేషన్స్ లిమిటెడ్‌కు గత ప్రభుత్వం విలువైన భూమిని కారుచౌకగా కేటాయించిందని ఆ కథనంలో తెలిపింది.
ఈ మేరకు 2015 నవంబర్ 13న ప్రత్యేకంగా జీఓ 433ని విడుదల చేశారట. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాకం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 717బి–5లో ఎకరా ధర రూ.80లక్షలు చొప్పున ఎకరన్నర కేటాయించిందట అప్పటి ప్రభుత్వం. జాతీయ రహదారికి పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టిందని సాక్షి రాసింది. అప్పట్లోనే మార్కెట్ ధర ఎకరా రూ.7కోట్లు ఉందని.. రూ.10కోట్ల విలువైన భూమిని కేవలం కోటి 20లక్షలకే చంద్రబాబు కట్టబెట్టారని సాక్షి రాసింది.
అప్పట్లోనే ఈ భూముల పందేరంపై స్థానికులు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేశారని.. కానీ.. పోలీసులను ను రంగంలోకి దించి ఆందోళనలు అణిచేశారని సాక్షి రాసింది. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి హుటాహుటిన భవన నిర్మాణాలు పూర్తి చేసేశారని.. ఇప్పుడు మళ్ళీ గ్రామస్తులు ఈ భూ సంతర్పణపై ప్రస్తుత అధికారులు దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారని సాక్షి రాసుకొచ్చింది.