సాయిరెడ్డి వర్సెస్ గజపతిరాజు.. విన్నరెవరు..?
చాలా దూకుడుతో తీసుకున్న నిర్ణయం.. వెంటనే సర్కారు జీవో జారీ చేయడం, అశోక్ ను తప్పించి ఆ వెంటనే ఢిల్లీ నుంచి సంచయితను రప్పించి.. ఇక్కడ పగ్గాలు అప్పగించడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే.. ఈ దూకుడు రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తూ.. న్యాయపరంగా ముందుకు సాగారు.. అశోక్. దీంతో ఆయన హైకోర్టులో విజయం దక్కించుకున్నారు. అయితే.. ప్రభుత్వం(పరోక్షంగా సాయిరెడ్డి), సంచయితలు మళ్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఈ తీర్పును సవాల్ చేశారు. దీనిపై విచారణ సాగాల్సి ఉంది. ఇదిలావుంటే.. మరో వైపు మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన పూర్వాపరాలు.. దస్తావేజులు, వీలునామానాలు వంటివాటిని తవ్వితీసి.. వీటి ద్వారా తన పైచేయిసాధించేందుకు సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే మాన్సాస్ సంస్ధకు సంబంధించి 2004, 2005 సంవత్సరం నుంచి అధికారులు ఆడిట్ మొదలు పెట్టారు. ట్రస్టుకు సంబంధించిన భూములు, ఇతర ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ మొదలు పెట్టారు. మొత్తం 27మంది ఆడిట్ అధికారులు ఏకకాలంలో రంగంలోకి దిగి ఈ లెక్కలతో కుస్తీ పనడుతున్నారు. వీరిని 4 టీములుగా విభజించి ఆడిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ లెక్కలు తేలేందుకు నెల రోజులుకు పైగా ఆడిట్ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గత ఈవో గా పనిచేసిన కె.రామచంద్ర మోహన్ మాన్సాస్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించడం వెనుక సాయిరెడ్డి ఉన్నారనే వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి మళ్లీ ఆడిట్ రాజకీయం తెరమీదికి వచ్చింది. అయితే.. సాయిరెడ్డి సెంట్రిక్‌గా జరుగుతున్న ఈ వ్యూహాన్ని అశోక్ గజపతిరాజు.. అంతే వ్యూహంతో సైలెంట్‌గా ఎదుర్కొంటుండడం గమనార్హం. ఈ క్రమంలో సాయిరెడ్డి దూకుడు.. అశోక్ న్యాయపరమైన.. వ్యూహంలో ఎవరు విజయం దక్కించుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి అశోక్‌దే విజయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.