ఏపీపై ఆశలు.. ఏంటి రాహుల్.. ఇది మరీ అత్యాశ కదూ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ పార్టీ తలరాతనే మార్చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు చాలా బలమైన దక్షిణాది రాష్ట్రం.. 42 ఎంపీ సీట్లు ఉన్న ఈ రాష్ట్రం కాంగ్రెస్‌కు కొండంత బలంగా ఉండేది.  ఎన్టీఆర్ వంటి ప్రజాకర్షక నాయకుడి దెబ్బకు మొదట్లో కుదేలైనా.. ఆ తర్వాత తట్టుకుని మరీ నిలబడింది. వైఎస్సార్ వంటి నాయకుడి కారణంగా మళ్లీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. అలాంటి కాంగ్రెస్‌ ఇప్పుడు రాష్ట్ర విభజన కారణంగా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటోంది. తెలంగాణలో తానే ప్రధాన ప్రతిపక్షం అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. ఏపీలో అడ్రస్‌ గల్లంతై అనాథగా మారిపోయింది.


రాష్ట్ర విభజన శాపం ఏపీ కాంగ్రెస్‌ ఎంతగా తాకిందంటే.. అంత వరకూ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవని దుస్థితి వచ్చేసింది. రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతున్నా.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ ఒక్క ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి చాటుకోలేకపోయింది. 2014, 2019  రెండు ఎన్నికల్లోనూ అసెంబ్లీ ముఖం చూడలేకపోయింది కాంగ్రెస్ పార్టీ.. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి ఏపీపై ఆశలు పెంచుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ముఖ్య నాయకులను రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించుకోవడం ఆసక్తి రేపుతోంది.  మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్‌, జేడీ శీలం, మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు నిన్న డిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలిశారు. వారితో సుదీర్ఘంగా చర్చించిన రాహుల్‌ ఏపీలో రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్‌ ప్రణాళిక, తదితర అంశాలపై చర్చించారు. ఇటీవలే.. త్వరలో జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేత చింతా మోహన్‌ కామెంట్ చేశారు.


ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక వేళ జగన్‌ జైలుకు వెళ్తే.. ఆ సంక్షోభం ఆధారంగా మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ ఆశపడుతోందన్న విశ్లేషణ కూడా ఉంది. మరి రాహుల్ గాంధీ ఆశలు నెరవేరతాయా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: