పొలిటికల్ ఫార్మింగ్: రేవంత్ తిట్లకు ఓట్ల చింతకాయలు రాలేనా..?
అయితే అదంతా పాత కాలపు ముచ్చట. ఇప్పుడు ఓట్లు రాలాలంటే.. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాల్సిందే. ప్రజల ఆలోచనను కాసేపు ఆపేయగలగాలి. ప్రజలను రెచ్చగొట్టాలి. రెచ్చగొడితే జనం విచక్షణ కోల్పోతారు. ఆలోచన కోల్పోతారు.. ఓ ట్రాన్స్‌లోకి వెళ్తారు.. ఓ మత్తులోకి వెళ్తారు.. జనం ఆ మత్తులో ఉండగానే వారి వేలితో మన గుర్తుపై ఓటు వేయించుకోవాలి.. ఇదీ ఇప్పటి పాలసీ.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు.
అందుకే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు భాష పూర్తిగా మార్చేశారు. కాస్త పరుషంగా మట్లాడే అలవాటున్న రేవంత్ రెడ్డి ఇక ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రత్యేకించి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆరోపణలు ఉంటున్నాయి. వాటిని ఆరోపణలు అనలేం..ఏకంగా తిట్లుగా చెప్పుకోవచ్చు. కేవలం కేసీఆర్ ఫ్యామిలీనే కాదు. టీఆర్‌ఎస్ కు చెందిన అందరు నేతలపైనా రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. ప్రత్యర్థి ఎవరైనా.. ఏ స్థాయికి చెందిన వారైనా ముందుగా వాళ్లను బండబూతులు తిట్టడం అనే స్ట్రాటజీని రేవంత్ రెడ్డి ఇటీవల అమలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి జోరుగా అధికార పార్టీ నేతలను బండబూతులు తిడుతుంటే.. పక్కనే నిల్చుని అసహనంగా కదలాల్సిన పరిస్థితి అనేక మంది సీనియర్లది. అయితే పరుష పదజాలంతో, తిట్లతోనూ ఎన్నికలను సక్సస్ చేసుకున్న చరిత్ర కేసీఆర్‌కు ఉంది. మరి ఇప్పుడు కేసీఆర్ రూట్లోనే వెళ్తున్న రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ దక్కించుకునే స్థాయిలో తిట్లతో ఓట్లు రాల్చుకుంటారా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.