హుజూరాబాద్: ఉపఎన్నిక వాయిదా... ఎవరికి ఫాయిదా..?

హుజూరాబాద్ ఉపఎన్నిక మరోసారి వాయిదా పడింది. కేసీఆర్ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌.. అవినీతి ఆరోపణలపై విచారణ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌ అయ్యి.. ఆ తర్వాత రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక తప్పడం లేదు. అయితే.. ఇప్పుడు దేశంలో అనేక చోట్ల ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. అందుకు కారణం కూడా ఈసీ చెప్పేసింది. తెలుగు రాష్ట్రాలు కరోనా కారణంగా ఇప్పుడే తాము ఎన్నికలకు సుముఖంగా లేమని తేల్చి చెప్పాయట. అందుకే ఉపఎన్నికల జోలికి ఈసీ వెళ్లలేదు.

మరి తెలంగాణ సర్కారు ఎందుకు హుజూరాబాద్ ఉపఎన్నికకు ముందుకు రాలేదు. అసలు హుజూరాబాద్ ఉపఎన్నికకు మాకు చాలా చిన్న విషయమని టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్న ఓ ప్రెస్‌ మీట్‌లో అన్నారు. మరి అలాంటప్పుడు మరోసారి ఎందుకు వాయిదా వేయించాల్సి వచ్చింది. ఉపఎన్నిక జరిపించేస్తే సరిపోయేది కదా.. తెలంగాణలో ఇప్పుడు కరోనా ప్రభావం నామమాత్రంగానే ఉంది. కరోనా కేసులు చాలా తక్కువగా వస్తున్నాయి. చివరకు స్కూళ్లు కూడా తెరిచారు. అసలు రాష్ట్రంలో కరోనా ఉందా అన్న అనుమానం కలుగుతోంది.

అన్ని కార్యక్రమాలు సాధారణంగా జరగుతుంటే.. ఉపఎన్నికలకు మాత్రం తగిన వాతావరణం లేదని కేసీఆర్ సర్కారు దాటవేయడాన్ని ఏమనాలి.. హుజూరాబాద్ ఎన్నిక అంటే కేసీఆర్ భయపడుతున్నారా.. లేక.. మరికొంత కాలం వాయిదా వేయడం ద్వారా వేడి తగ్గించి.. అనుకూల వాతావరణం సాధించాలని చూస్తున్నారా అన్నది అర్థం కాని విషయం. ఇప్పటికే ఈటల రాజేందర్ ప్రభావం బాగా తగ్గిందని.. ఇంకొంత కాలం వాయిదా వేయిస్తే.. సులభంగా ఎన్నిక గెలవచ్చుఅని కేసీఆర్ భావిస్తుండొచ్చు.

అయితే.. ఉపఎన్నిక వాయిదా వేయించడం ద్వారా కేసీఆర్ భయపడుతున్నారన్న వాదన కూడా జనంలోకి వెళ్తుంది.. ఈటలను చూసి భయపడుతున్నారన్న వాదన కూడా బీజేపీ వినిపిస్తుంది. మరి ఈ వాయిదా ఫాయిదా ఎవరికి దక్కుతుంది.. కొంపదీసి కేసీఆర్ వ్యూహం బెడిసికొడుతుందా అన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: