రాజకీయ జోస్యం :ఎవరు గెలిచినా ఓడేది ప్రజలే !
ఏం కాదు నిన్నటి దాకా నేనొక సోషల్ వర్కర్ ను ఇప్పుడు ఫక్తు రాజకీయ వేత్తను అని పవన్ చెప్పినా, మళ్లీ అధికారం కోసం, తన తరువాత తరం కోసం చంద్రబాబు బరిలో నిలిచినా లేదా తన వారిని నిలిపినా, ఇవేవీ కాదు సంక్షేమం పేరిట మళ్లీ రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయం అని జగన్ మోహన్ రెడ్డి అనే లీడర్ చెప్పినా, ఎవ్వరు ఏం పలికినా, పలికించినా అంతిమంగా ఓడేది ప్రజలు..గెలిచేది నాయకులు. కనుక కొద్ది రోజులే ఈ తిట్లు వినిపిస్తాయి. ఆ తరువాత ఆంధ్రావని రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. అ నూహ్యం అనుకున్నదొకటి వరించి తీరుతుంది. అవును! ఆ అనూహ్యంలో తిట్లు, శాపనార్థాలు ఉండవు..వ్యక్తిగత లాభాపేక్షతో కూడిన ప్రతిపాదనలూ, పరిశ్రమలూ, రాయ ల్టీలు, రాయల్ బిజినెస్ లు తెరపైకి వస్తాయి. అందాక చూస్తూ ఉండడం మీ బాధ్యత.
బాధ్యత లేని పౌరుల కారణంగా వచ్చే తగాదాలు అన్నీ ఇలానే ఉంటాయి. ఇన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నా జాతీయ పార్టీల హవాను అడ్డుకోవడం కుదరని పని అని గతం లోనూ ఇప్పుడూ తేలిపోయాక బీజేపీ, కాంగ్రెస్ మనల్ని చూసి, దక్షిణాది పార్టీలను చూసి, ప్రజలను చూసి ముసి ముసి నవ్వులు నవ్వి పోతాయి. అప్పుడు గెలిచేది కూడా నాయకులే.
ఓడిన ప్రజలంతా హాయిగా ఎప్పుడు డబ్బులు తమ అకౌంట్లలోకి పథకాల పేరిట వస్తాయా అని వేచి చూసి, వేచి చూసి, సంబంధిత తాయిలాలో, ఫలాలో, ఫలితాలో సిద్ధిం చాక లేదా దక్కాక హాయిగా ఇంటి ముందు నిలిచిన డ్రైనేజీలో కాగితపు పడవలు వదిలి ఆనందిస్తారు. ఇదే రేపటి వేళ జరిగేది. జరగబోయేది. ఇదే తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా నడిచే రాజకీయం. ఈ సామాజిక సూత్రాలను దేశ రాజకీయాలకూ, వివిధ ఉద్యమాలతో కాలం గడుపుతున్న కమ్యూనిస్టు శక్తులకూ వర్తిస్తాయి.ఇదిగో లీడరూ! మళ్లీ అనవోయ్ రైతే రాజు అని! విని ఆనందించాలి నేను..ఆనందించాలి మీరు..
- రత్నకిశోర్ శంభుమహంతి
పలు విధాలా వ్యాప్తిలో ఉన్న చెడ్డ కాలాల చెంత