వై.ఎస్.షర్మిల.. ఆ ధైర్యానికి సలాం..?
ఓ నానుడి ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువూ రెండు సార్లు తయారవుతుందట. ఒకటి తయారు చేసేవాడి మనస్సులో ఊహా చిత్రం.. రెండోది వాస్తవ చిత్రం.. అంటే ముందుగా నీకు నీ లక్ష్యంపై స్పష్టత ఉంటే.. ఆ లక్ష్య సాధన విజయవంతం అవుతుంది. మరి ఆ లక్ష్య సాధనపై షర్మిలకు ఇప్పటికే ఓ నమ్మకం ఉండి ఉండాలి. కానీ.. తెలంగాణ రాజకీయ క్షేత్రం ఏపీతో పోల్చుకుంటే చాలా వైరుధ్యం ఉన్నది అని చెప్పాలి. అందులోనూ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ శూన్యత కూడా కనిపించడం లేదు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం ద్వారా ఏపీలో జీరోకు చేరినా.. తెలంగాణలో మాత్రం ఇంకా బలంగానే ఉంది. వరుసగా రెండోసారి అధికారానికి ఆ పార్టీ దూరమైనా.. భవిష్యత్‌లో అధికారం అందుకునే అవకాశాలు ఉన్న పార్టీగా కాంగ్రెస్‌ను చెప్పొచ్చు. ఆ పార్టీ మూలాలు అలా ఉన్నాయి. ఇక రెండో పార్టీ బీజేపీ.. దక్షిణాదిలో తమ బలం పెంచుకునేందుకు అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను బీజేపీ భావిస్తుంటుంది. మరి ఈ రెండింటినీ కాదని.. షర్మిల పార్టీ వైపు జనం మొగ్గుతారా.. ఒక్క పాదయాత్ర ద్వారా వైఎస్ షర్మిల తన ముద్ర చాటతారా..? తెలంగాణ రాజకీయాల్లో రాణించాలని.. తెలంగాణ తొలి మహిళా సీఎం అవ్వాలని భావిస్తున్న ఆమె కలలు నిజం అవుతాయా.. అన్నది ఇప్పుడే చెప్పలేం..కానీ.. షర్మిల ధైర్యానికి, పట్టుదలకు మాత్రం శభాష్ చెప్పొచ్చు.